కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీ రాయలసీమ చరిత్రలో చీకటి దినమని రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ కన్వీనర్ చంద్రశేఖర్ అన్నారు. కర్నూలులో ఉన్న రాజధానిని ఆ రోజు హైదరాబాద్‌కు తరలించడంతోనే సీమకు కష్టాలు ప్రారంభమయ్యాయని అన్నారు. శుక్రవారం ఆర్‌పీఎస్‌ఎస్‌ఎఫ్, టీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక గాయత్రీ ఎస్టేట్ నుంచి కలెక్టరేట్ వరకు నల్లజెండాలతో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్‌పీఎస్‌ఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీరాములు, టీఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ చంద్రప్ప ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడారు. రాయలసీమ వాసుల త్యాగంతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే రాజధానిని కర్నూలుకు కేటాయించాలని కోరుతూ తక్షణమే అన్ని రాజకీయ పార్టీలూ లేఖలు ఇవ్వాలని కోరారు. రాజధాని చేయలేకపోతే రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో సైన్స్ సిటీ, మదనపల్లిలో ఐటీ పార్కును ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీను, రాజు, రవి, జనార్ధన్, వినయ్ పాల్గొన్నారు.