డిగ్రీ పరీక్షల్లో గందరగోళం
► ఇన్సూరెన్స్ ప్రశ్నపత్రానికి బదులు అడ్వాన్స్ కార్పొరేట్ అకౌంట్స్ పేపర్
► పరీక్ష రాయని 130 మంది విద్యార్థులు
గుంతకల్లు టౌన్: ఎస్కేయూ డిగ్రీ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం ప్రవేశపెట్టడంతో శ్రీ శంకరానంద డిగ్రీ కాలేజి విద్యార్థులను ఎస్‌కేపీ ప్రభుత్వ, శ్రీశైల భ్రమరాంబిక మహిళా డిగ్రీ కళాశాల్లోని కేంద్రాలకు వేశారు. శనివారం ఉదయం థర్డ్ ఇయర్ విద్యార్థులకు ఇక్కడ పరీక్షలు జరిగాయి. శంకరానంద డిగ్రీ కాలేజికి చెందిన 132 మంది థర్డ్ ఇయర్ బీకాం జనరల్ విద్యార్థులు ఆప్షనల్ సబ్జెక్ట్ అయిన ఇన్సూరెన్స్ సబ్జెక్టు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో రాసిన 130 మంది, శ్రీశైల భ్రమరాంబిక మహిళా డిగ్రీ కాలేజిలో రాసిన ఇద్దరు విద్యార్థులకు ఇన్సూరెన్స్ ప్రశ్నాపత్రానికి బదులు అడ్వాన్స్ కార్పొరేట్ అకౌంట్స్ పేపర్‌ను అందజేశారు. పరీక్ష పత్రం తారుమారైందని విద్యార్థులు ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు.
వీరు రాయాల్సిన ప్రశ్నపత్రం అసలు రాలేదని అధికారులు తెలుసుకున్నారు. విషయాన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్ జ్ఞానేశ్వర్ ఎస్కేయూ యూజీ ఎగ్జామినేషన్స్ డీన్, డీప్యూటీ రిజిస్ట్రార్‌ల దృష్టికి తీసుకె ళ్లారు. వర్సిటీ అధికారులు ప్రశ్నపత్రాన్ని గంటన్నర తర్వాత కాలేజీ ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపారు. దీనిని డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు అందజేసి పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. శ్రీశైల భ్రమరాంబిక డిగ్రీ కాలేజి పరీక్ష కేంద్రంలో నిర్వాహకులు ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఇద్దరు విద్యార్థులతో పరీక్ష రాయించారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంలో అప్పటికే 130 విద్యార్థులు ఆన్సర్‌షీట్లను ఇన్విజిలేటర్లకు ఇచ్చేసి బయటికి వచ్చేశారు. పరీక్ష రాసేందుకు మరింత సమయాన్ని కేటాయిస్తామని, పరీక్షకు హాజరుకావాలని విద్యార్థులకు ప్రిన్సిపల్ సూచించారు. అయితే మధ్యాహ్నం తాము తిరిగి సప్లిమెంటరీ పరీక్ష రాయాల్సి ఉందని, ఆ పరీక్ష ఎలా రాయాలని వారు ప్రిన్సిపల్‌తో గొడవకు దిగారు.
తమకు న్యాయం చేయాలని అరగంట పాటు బైఠాయించారు. ప్రిన్సిపల్ వెంటనే డిప్యూటీ రిజిస్ట్రార్ నాయక్‌తో మాట్లాడారు. ఇన్సూరెన్స్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, ఆ తేదీని పత్రికల ద్వారా ప్రకటిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మహేష్, అబ్దుల్‌బాసిద్, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు రంగా, శివ పరీక్షను మళ్లీ నిర్వహించాలని పట్టుబట్టారు.
మా తప్పేమీ లేదు..
యూజీ పరీక్షల విభాగం అధికారులు ఇన్సూరెన్స్ ప్రశ్నపత్రాన్ని మాకు పంపలేదు. గతంలో అయితే ఫలానా విద్యార్థి ఈ పరీక్ష రాస్తున్నాడు..ఆ సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నపత్రాలు ఇన్ని పంపాలని ఇండెంట్ పెట్టేవాళ్లం. కానీ ఇప్పుడంతా ఆన్‌లైన్. ఇందులో తమ తప్పేమీ లేదు. విద్యార్థులెవ్వరూ ఆందోళన చెందనక్కర్లేదు. పరీక్షను తిరిగి నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు హామీ ఇచ్చారు - డాక్టర్ జ్ఞానేశ్వర్, ప్రభుత్వ డిగ్రీ కాలేజి ప్రిన్సిపల్