సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని తహశీల్దార్లను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో తిరిగి వారంతా మన జిల్లాకు రానున్నారు. వీరికి పాతస్థానాల్లోనే పోస్టింగ్ ఇచ్చేందుకు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అయితే కొందరు తహశీల్దార్లు మాత్రం తాము కోరుకున్న స్థానాల్లో పోస్టింగ్ పొందేందుకు పైరవీలు మొదలు పెట్టారు. తహశీల్దార్ల పోస్టింగులకు సంబంధించి నేడు ఉత్తర్వులు రానున్న నేపథ్యంలో రెవెన్యూశాఖలో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది.
సాక్షి, కడప: ఈ నెల7న జిల్లాలోని రెండు ఎంపీ, పది అసెంబ్లీ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నిబంధనల మేరకు ఒకే జిల్లాలో మూడేళ్లకు పైబడి తహశీల్దార్లుగా విధులు నిర్వహించిన వారిని ఇతర జిల్లాకు ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. ఈక్రమంలో జిల్లాకు చెందిన 45మంది తహశీల్దార్లు అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు బదిలీపై వెళ్లారు. వీరి స్థానాల్లో విధులు నిర్వహించేందుకు ఆయా జిల్లాల నుంచి 48మంది తహశీల్దార్లు జిల్లాకు వచ్చారు. ఎన్నికలు ముగియడంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన తహశీల్దార్లు తిరిగి జిల్లాకు రానున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు బుధవారం జిల్లా కలెక్టరుకు అందనున్నాయి.
పాత స్థానాలకు వెళ్లేందుకు
చాలా మంది విముఖత:
సొంత జిల్లాకు రానున్న తహశీల్దార్లకు తిరిగి పాత స్థానాల్లోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆ స్థానాలకు వెళ్లేందుకు చాలామంది తహశీల్దార్లు విముఖత చూపుతున్నారు. తాము కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. జూన్8న రాష్ట్రముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
పభుత్వం ఏర్పాటు అనంతరం స్థానిక రాజకీయ నాయకులు అధికారులపై పెత్తనం చెలాయించే అవకాశం ఉంది. వారికి తెలియకుండా మండలస్థాయి అధికారులు విధుల్లో చేరే అవకాశం దాదాపు ఉండదు. దీంతో చాలామంది తహశీల్దార్లు తాము కోరుకున్న చోట పోస్టింగ్ పొందేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక నేతలను సంప్రదిస్తున్నారు. తమకు పోస్టింగ్ ఇప్పించాలని విన్నవిస్తున్నారు. దీంతో రాజకీయనాయకులు కూడా తహశీల్దార్ల పోస్టింగ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏ తహశీల్దారు ఏపార్టీకి అనుకూలంగా అంటారు? అతని పనితీరు ఎలా ఉంటుంది? బాధ్యతలు తీసుకున్న తర్వాత తమ మాట విం టారా? బేఖాతరు చేస్తారా?అనే అంశాలపై ఆలోచిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉంటారనే తహశీల్దార్లను తమ ప్రాంతంలో పోస్టింగ్‌లు ఇప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు.
టీడీపీ నాయకుల హుకుం
తమకు తెలియకుండా తమ నియోజకవర్గాలో కొత్తగా తహశీల్దార్లకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు వీల్లేదని తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జిలు అధికార యంత్రాంగానికి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 9 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే మేడా మల్లిఖార్జునరెడ్డి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేల మాటలు పరిగణలోకి తీసుకుని తహశీల్దార్లకు పోస్టింగులు ఇవ్వకూడదని, తమ పార్టీ అధికారంలోకి రాబోతోంది కాబట్టి తాము సిఫార్సు చేసిన వారికే పోస్టింగులు ఇవ్వాలని టీడీపీ నేతలు ఇప్పటికే అధికారులకు స్పష్టం చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే మాటను పరిగణలోకి తీసుకోవాలో... అధికారపార్టీకి చెందిన నేతల మాటలను వినాలో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తహశీల్దార్లు మాత్రం ఇటు ఎమ్మెల్యేలను, అటు టీడీపీ నేతలను ఇద్దరినీ కలిసి వారి ప్రయత్నాలు వారు ముమ్మరం చేసుకుంటున్నారు.
పైరవీలు షురూ..
Published Wed, May 28 2014 1:57 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement
Advertisement