సమీక్షలు, ప్రొటోకాల్ విధుల్లో జిల్లా అధికారులు
కార్యాలయాల్లో పేరుకుపోతున్న ఫైళ్లు
పనులు కాక ఇబ్బందిపడుతున్న ప్రజానీకం
విజయవాడ : రాజధాని ముఖ్య కేంద్రం విజయవాడ అయినందుకు సంబరపడాలో.. పాలనను పక్కనబెట్టి నిత్యం సీఎం, మంత్రుల చుట్టూ తిరిగే అధికారులను చూసి బాధపడాలో అర్థంకాక జిల్లావాసులు తలలు పట్టుకుంటున్నారు. అమరావతి రాజధాని అయినప్పటికీ ప్రభుత్వ కార్యకలాపాలన్నీ విజయవాడ నుంచే జరుగుతుండడంతో అంతా సంతసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసుకున్నాక కొంతమంది అమాత్యులు కూడా ఆయన బాటే పట్టారు. నిత్యం సీఎంను కలిసేందుకు సందర్శకులు రావడం.. రోజువారీ సమీక్షలు.. అడపాదడపా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించడంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. మిగిలిన మంత్రులు కూడా తమ శాఖ సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు తరచు ఇక్కడికే వచ్చిపోతున్నారు. వీరు నిత్యం నిర్వహించే సమీక్షలను చూసి అధికారులు, సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు.
సమీక్షలకే పరిమితం..
గంటలకొద్దీ సమీక్షలు సాగడంతో జిల్లాలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. దీంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అధికారులు క్షేత్ర సందర్శనను పూర్తిగా మానేశారు. వీఐపీల ప్రొటోకాల్ విధుల నిర్వహణ, వీడియో కాన్ఫరెన్స్‌లు, సెల్ కాన్ఫరెన్స్‌లు, సమీక్ష సమావేశాలతోనే అధికారులు కాలక్షేపం చేస్తున్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారి వరకు ప్రతిఒక్కరూ సీఎం క్యాంపు ఆఫీసు, కలెక్టర్ క్యాంపు ఆఫీసు, ఎయిర్‌పోర్టు, గెస్ట్‌హౌస్‌లకే పరిమితమవుతున్నారు. గంటలకొద్దీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద అధికారులు పడిగాపులు పడుతున్నారు. ఫలితంగా ఆయా కార్యాలయాల్లో ఫైళ్లన్నీ పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలన స్తంభిస్తోంది. ఇదిలా ఉంటే మరికొందరు అధికారులు, సిబ్బంది నివేదికలు తయారుచేయడంలో తలమునకలై ఉంటున్నారు. కనీసం గ్రామస్థాయిలో పనిచేసే వీఆర్వోలు, ఇంజినీరింగు డిపార్టుమెంట్‌లో పనిచేసే ఏ ఒక్క వర్క్‌ఇన్‌స్పెక్టర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ప్రజానీకం గగ్గోలు పెడుతోంది. రోజూ గ్రామాలు, పట్టణాల్లో జరిగే రోడ్ల అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఇంజినీరింగ్, ఆర్ అండ్ బీ, ఎన్‌హెచ్ అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లకుండా క్యాంపు ఆఫీసుల వద్దే మకాం వేస్తున్నారు. ఇదిలా ఉండగా సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకు వర్క్‌షాపుల ఏర్పాటు, జనసమీకరణ వంటి పనుల్లో అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉంటున్నారు. ప్రతి నెల నాలుగైదు పబ్లిక్ మీటింగులు, వర్క్‌షాపులలో స్టాల్స్ ఏర్పాటుచేయడం వ్యయప్రయాసలతో కూడుకున్నదని అధికారులు వాపోతున్నారు.
మంత్రులతో మొర
ప్రతిరోజూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టడం వల్ల రాత్రి పొద్దుపోయే వరకు తాము ఇబ్బందులు పడుతున్నామని మంత్రులు, ప్రజాప్రతినిధులకు అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. సోమవారం మచిలీపట్నంలో జరిగిన మీకోసం కార్యక్రమానికి పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంతో కలెక్టర్ బాబు.ఎ. ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల ప్రొటోకాల్ విధులు, జిల్లా ఉన్నతాధికారులు చేయనవసరం లేదని, మంత్రుల పర్యటనలకు దిగువ స్థాయి అధికారులను పంపితే చాలని పలు శాఖల ఉన్నతాధికారులకు కలెక్టర్ ఆదేశాలివ్వడం కొసమెరుపు.
పాలన మూలన
Published Thu, Feb 18 2016 12:45 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement