యూజమాన్య పద్ధతులతో వెనామీ సాగు లాభదాయం
వ్యాధులపై అప్రమత్తత అవసరం
కైకలూరు : రొయ్యల సాగు ఒడిదుడుకుల్లో పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ కలిగిన వెనామీ రొయ్యల సాగు జిల్లాలో ఇటీవల పెరిగింది. జిల్లాలో ప్రస్తుతం 22 వేల ఎకరాల్లో సాగవుతోంది. సరైన శాస్త్రీయ పద్ధతులు పాటించకపోవడంతోనే నష్టాల బారిన పడుతున్నారు. రొయ్యల సాగు లాభాలొస్తే కుబేరుడిని, నష్టాలొస్తే బిచ్చగాడిని చేస్తుందని నానుడి. అందుకే రైతులు యూజమాన్య పద్ధతులు పాటించి పంటను కాపాడుకోవాలని కైకలూరు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బీ రాజ్‌కుమార్ సూచిస్తున్నారు.
చెరువును ఎండ బెట్టడం ఉత్తమం...
రొయ్యల చెరువులో మట్టి తన సహజ లక్షణాలను కోల్పోతుంది. ఎండిన తర్వాత మూడు సార్లు దుక్కి దున్ని, దుక్కికి దుక్కికి మధ్య ఏడు రోజులు విరామం ఇవ్వాలి. నేలను రోలర్‌తో చదును చేయాలి. చెరువును బాగా ఎండబెట్టడంతో అడుగున చేపలు, నత్తలు వంటి జీవులు నశిస్తాయి. ఒకవేళ చెరువు పూర్తిగా ఎండని పక్షంలో టీ సీడ్ కేకు, కాపర్ సల్ఫేట్‌ను ఉపయోగించాలి. పూర్తిగా ఆరిన చెరువులో సూర్యరశ్మి వల్ల అడుగున ఉండే వ్యర్థాలు ఆక్సీకరణం చెంది, తొలగించడానికి సులువుగా ఉంటుంది. రొయ్యలు అడుగు భాగాన సంచరించే జీవులు కాబట్టి నేల స్వభావం రొయ్య ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
జీవభద్రత వ్యవస్థను పటిష్టం చేయాలి...
వెనామీ రొయ్యల చెరువులో జీవ వాతావరణ వ్యవస్థ ఎంతో కీలకం. నేల, నీరు, సీడ్, గాలి, జంతువులు, మనుషులు ఇలా ఆరు మాధ్యమాల ద్వారా సూక్ష్మజీవులు చెరువులోకి ప్రవేశిస్తారుు. పీతలు, తాబేళ్లు, కప్పలు, పాములు, కుక్కలు, నక్కలు వంటివి రొయ్యల చెరువు వద్దకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీతలు, నత్తల బొరియల్లో గ్యాస్ బిల్లలు వేసి పూడ్చివేయాలి. చెరువులోకి నీటిని నింపేటప్పుడు 40 లేదా 60 నంబరు మెష్ హపాను కట్టాలి. నీటిని నింపిన తర్వాత 30 లేదా 40 పీపీఎంతో క్లోరినేషన్ చేసుకోవాలి. నత్తలు, పీతలు పైకి ఎక్కకుండా 30-50 సెంటీ మీటర్ల ఎత్తులో క్రాబ్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి. ఆకాశంలో ఎగిరే పక్షులు వ్యర్థ పదార్థాలను పడవేసినా లోపలికి వెళ్లకుండా ఎరుపు వలలతో బర్డ్ ఫెన్సింగ్ నిర్మించుకోవాలి. రొయ్య పిల్లలను వదిలే ముందు మూడు సార్లు పీసీఆర్ టెస్టులు చేయించాలి. రొయ్యల చెరువుకు ఉపయోగించే వల, బకెట్, టబ్స్, పని చేసే సిబ్బంది చేతులు 100 పీపీఎం, అయోడిన్ ద్రావకంతో శుభ్రపర్చుకోవాలి.
ఏరియేటర్లు కీలకం...
రొయ్యలకు నిత్యం ఆక్సిజన్ అందుబాటులో ఉండాలి. దీనికి ఏరియేటర్లను ఉపయోగిస్తారు. వీటిని ఏర్పాటు చేసేటప్పుడు నీటి ప్రవాహ దిశను బట్టి దాని పైపు భూమిలో బలంగా నాటాలి. నీటి ప్రవాహం వృత్తాకారంలో ఉండేలా తగిన మార్పులు చేసి బిగించాలి. ఏరియేటర్లతో చిన్న దశలో రొయ్య పిల్లలకు ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి చెరువు అడుగుభాగాన పరిశుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతోంది. బయోమాస్ ఆధారంగా హెచ్‌పీ మోటర్లు వినియోగించాలి.
వెనామీ.. జాగ్రత్త సుమీ..
Published Thu, Jan 14 2016 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement