ఆప్షన్లు ఉండాల్సిందే
Published Wed, Apr 16 2014 12:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
{పత్యూష్ సిన్హా కమిటీకి స్పష్టం చేసిన అఖిలభారత సర్వీసు అధికారులు
మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఏ రాష్ట్రానికి వెళ్లాలనే విషయంలో తమకు ఆప్షన్లు ఉండాల్సిందేనని అఖిలభారత సర్వీసుల అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన అధికారులను స్థానికత ఆధారంగా.. ఇతర రాష్ట్రాల వారిని రోస్టర్ విధానాన్ని అనుసరించి విభ జించాలని కోరారు. ఈ మేరకు ప్రత్యూష్ సిన్హా కమిటీ ముందు ఎక్కువ మంది అధికారులు తమ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించినట్లు తెలిసింది. ఈ అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మరో మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలను వెల్లడించే అవకాశమున్నట్లు సమాచారం.
అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించే ఉద్దేశంతో మంగళవారం రాష్ట్రానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సీనియర్ అధికారులతో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ అయింది. ఐఏఎస్ అసోసియేషన్ తరఫున ఎల్వీ సుబ్రమణ్యం, రేమండ్ పీటర్, శ్రీనివాసరాజు.. ఐపీఎస్ అసోసియేషన్ తరఫున మాలకొండయ్య, కౌముది, కృష్ణప్రసాద్, శివధర్‌రెడ్డి, వి.రవీందర్.. ఐఎఫ్‌ఎస్ అసోసియేషన్ తరఫున ఎంజే అక్బర్, బి.మురళీకృష్ణ, ఎస్‌కే ఛోటారాయ్, ఎం.సుధాకర్, ఎస్‌బీఎల్ మిశ్రా తదితరులు హాజరయ్యారు. ఆప్షన్లు ఉండాల్సిందేనని ఐఏఎస్‌లు ఈ సందర్భంగా కమిటీకి స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే హాజరైన ఐఏఎస్ అధికారులెవరూ సమావేశం అనంతరం మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి....
ఐపీఎస్‌ల అభిప్రాయాలు: రాష్ట్రానికి చెందిన వారిని స్థానికత ఆధారంగా, రాష్ట్రేతర అధికారులను రోస్టర్ విధానంలో విభ జించాలి. తద్వారా సొంత ప్రాంతాల్లో పనిచేయడానికి వీలుంటుంది.
గుజరాత్, ఒడిశాకు దాదాపు సమానమైన జనాభా ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. కేరళ, జార్ఖండ్‌లకు సమానమైన జనాభా తెలంగాణలో ఉంది. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉన్నారో అదే సంఖ్యలో ఈ రాష్ట్రాల్లోనూ ఉండాలి.
ప్రస్తుతం రాష్ట్రంలో మంజూరైన సంఖ్య కంటే తక్కువగా ఐపీఎస్ అధికారులున్నారు. ఆ మేరకు ముందుగా ఐపీఎస్‌లను కేటాయించాకే ఇరు రాష్ట్రాలకు పంపిణీచేయాలి. ఈ పంపిణీ జరిగాక నక్సల్, ఏజెన్సీ ప్రాంతాలకు అవసరమైన చోట ప్రత్యేకంగా అధికారులను ఇవ్వాలి.
ఐఎఫ్‌ఎస్‌ల అభిప్రాయాలు ఇలా..
అధికారులందరికీ వ్యక్తిగత ఆప్షన్‌లు ఇవ్వాలి. రాష్ట్రానికి చెందిన వారిని స్థానికత ఆధారంగా, రాష్ట్రేతరులకు రోస్టర్ ద్వారా లేక ఆప్షన్లు ఇచ్చి పంపిణీ చేయాలి. విభజన మార్గదర్శకాల్లో పారదర్శకత పాటించాలి.
గతంలో రాష్ట్రాల విభజన సమయంలో రాజకీయ జోక్యం కారణంగా అధికారుల పంపిణీ సరైన రీతిన జరగలేదు. ఆ దృష్ట్యా ఏ ప్రాతిపదికన అధికారులను పంపిణీ చేస్తున్నారు? ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారో స్పష్టంగా ముందే వెబ్‌సైట్‌లో ఉంచాలి.
Advertisement
Advertisement