
రైల్వే ఓవర్ బ్రిడ్జిపై రాత్రి చలికి వణికిపోతు నిద్రిస్తున్న అనాథలు (ఫైల్)
ఆధునిక సమాజంలో అనాథలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఆకలితో అలమటిస్తూ నిత్యం జీవితంతో పోరాడుతూ బతుకుతున్న దుస్థితి. విధి వారిని కుటుంబం నుంచి దూరం చేసినా.. పట్టుదలతో ఆకలి తీర్చుకుంటున్నారు. చూసే వారు లేక అనారోగ్యంతో పిట్టల్లా రాలిపోతున్నారు అనాథలు. వీరిని ఆదుకుంటామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం చేతులేత్తిసింది. దీనికి తోడు అధికారుల మనసు కూడా రాకపోవడంతో నిశ్శబ్దంగా తనువు చాలిస్తున్నారు...
ప్రకాశం, చీరాల: అనాథల జీవితాలు అర్దాంతరంగా ముగిసిపోతున్నాయి. నా అనే నాథుడే లేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండ, వాన...చలికి చితికిపోతున్నారు. రోజు ఏదో ఒక వీధిలో అనారోగ్యంతో తనువు చాలిస్తున్నారు. వారి కోసం ఆదుకునేందుకు మేమున్నాం అంటూ ప్రగల్బాలు పలికి మిన్నకుండి పోయింది. మున్సిపల్ అధికారులు వారిపై మమకారం చూపకపోగా, వారికి కేటాయించిన నిధులను సైతం మింగేశారు. అనాథల కోసం రాత్రి విడిది (షెల్టర్) ఏర్పాటు చేస్తామని మూడేళ్ల క్రితం మున్సిపల్ కౌన్సిల్‌లో ఆమోదం చేసి పైపెచ్చు రూ.5 లక్షలు ఖర్చు చేశారు. కానీ ఒక్క అనాథకు కూడా షెల్టర్ ఇవ్వలేదు.
మనసు లేని అధికారులు...
వారికి ప్రతిరోజు అల్పాహారం, రాత్రికి భోజనం ఏర్పాటు చేసి రాత్రి వసతి కల్పిస్తామంటూ ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీవో విడుదల చేసింది. రాష్ట్రంలోని సంగతేమో కానీ చీరాలలో మాత్రం అనాథలను ఆదుకోవడం లేదు. దేవుడు వరమిచ్చినా పూజారి వదడంలేదన్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసినా అమలు చేసేందుకు కింది స్థాయి అధికారులకు మాత్రం మనసు రావడంలేదు. దీంతో అనాథలుగా మారిన ఎంతో మంది మహిళలు, వృద్ధులు ఎండ వేడిమికి చలి గాలులకు వణికిపోతు రైల్వే స్టేషన్, బస్టాండ్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, దుకాణాల అరుగులపై నిద్రిస్తు అల్లాడిపోతున్నారు.
పథకం ఉద్దేశం...
పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) సిబ్బంది పట్టణంలో అనాథలు ఎంత మంది ఉన్నారు, వారు ఏఏ పనులు చేస్తుంటారనే విషయాలను సేకరించి అధికారులకు నివేదిస్తారు. ఆ నివేదికల ప్రకారం అధికారులు నిధులు విడుదల చేసి వారికి ప్రతిరోజు అల్పాహారం, రాత్రికి భోజనం అందిండంతో పాటు వారు రాత్రి నిద్రించేందుకు వసతి (షల్టర్) ఏర్పాటు చేయాలి. 2015–16 గాను చీరాలలో 50 మంది అనాథలు మాత్రమేనని అధికారులు లెక్కలు తేల్చారు. ఏ ప్రాంతంలో చూసినా అనాథలు, బిక్షగాళ్లు లెక్కకు మించి తిరుగుతుంటే అధికారులు మాత్రం చీరాలలో కేవలం 50 మంది అనాథలు ఉన్నట్లు లెక్కలు తేల్చడం విస్మయానికి గురి చేస్తోంది.
హడావుడిగా రూ. 5 లక్షలు ఖర్చుచేశారు...
ప్రభుత్వం జీవో విడుదల చేసిన రెండేళ్లకు చీరాల మున్సిపల్ అధికారులు, పట్టణ పేదరిక నిర్మూలన (మెప్మా) ద్వారా అనాథలకు షెల్టర్ ఏర్పాటు చేసేందుకు హడావుడి చేశారు. నిరుపయోగంగా ఏ మాత్రం నివాసయోగ్యంకాని కూలేందుకు సిద్ధంగా ఉన్న మున్సిపల్ కమిషనర్ బంగ్లా అనాథల షల్టర్‌కు సిద్ధం చేశారు. పెచ్చులూడుతున్న ఆ భవనానికి రూ. 5 లక్షలతో చిన్నచిన్న మరమ్మతులు చేపట్టి రంగులు వేయించారు. అనాథలైన స్త్రీ, పురుషులను వేర్వేరుగా ఉంచేందుకు గదులను సిద్ధం చేశారు. వంట గది, బాత్ రూమ్‌లు, లెట్రిన్‌లు కూడా కట్టించారు. తీరా షెల్టర్‌ను ప్రారంభించే నాటికి స్థానికులు అభ్యంతరం చెప్పారు. నివాస ప్రాంతాలలో అనాథలను పెడితే షెల్టర్‌లోకి ఎటువంటి వారు వస్తారో తెలియదు, ఈ ప్రాంతంలోకి దొంగలు, ఇతర నేరగాళ్లు వచ్చే ప్రమాదం ఉందని అడ్డు చెప్పారు. దీంతో అధికారులు షెల్టర్ ప్రారంభోత్సవాన్ని నిలుపుదల చేశారు. రూ. 5 లక్షలతో మరమ్మతులు చేపట్టినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా అయ్యాయి. ప్రస్థుతం ఆ భవనాన్ని మున్సిపాలిటికి చెందిన పాత సామాగ్రిని భద్ర పరిచేందుకు ఉపయోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment