సీఎంకు వ్యతిరేకంగా సమావేశం పెట్టలేదు
హైదరాబాద్ : కేంద్ర మంత్రుల కమిటీ రాష్ట్రంలో పర్యటించి వాస్తవ పరిస్థితులపై దృష్టి సారిస్తే రాష్ట్రంలో పరిస్థితి చక్కబడుతుందని... రాష్ట్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తేవాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి నివాసంలో మంగళవారం మంత్రులు డొక్కా మాణిక్య వర ప్రసాద్, బాలరాజు, మహీధర్ రెడ్డి, రఘువీరారెడ్డి, కేంద్ర మంత్రి చిరంజీవి తదితరులు సమావేశమయ్యారు.
రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. కేంద్ర మంత్రుల కమిటీ రాష్ట్రంలో పర్యటించేలా చూసే బాధ్యతను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు అప్పగించారు. బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. సమావేశం అనంతరం మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ సేవ్ ఆంధ్ర ప్రదేశ్, సేవ్ కాంగ్రెస్ నినాదంతో అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏపీ ఎన్జీవోలు ఉద్యమాన్ని విరమించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తాము ఈ సమావేశం పెట్టలేదని ....ముఖ్యమంత్రి మార్పు ఊహాజనితమేనని ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు.