అరసవిల్లి ఆదిత్యుని సేవలు ఆన్‌లైన్ చేయిస్తాం
అరసవల్లి : దేశంలోనే ఏకైక నిత్య పూజలందుకుంటున్న అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి సంబంధించిన సేవలను ఆన్‌లైన్ చేయిస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం అరసవల్లి ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 68 దేవాలయాలకు త్వరలో ట్రస్ట్‌బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బంది కొరత తీరుస్తామన్నారు.
హుద్‌హుద్ తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆలయాలు ధ్వంసం అయ్యాయని, రూ.5 కోట్లతో మరమ్మతులు చేస్తున్నామన్నారు. ఆలయంలో గతంలో జరిగిన కేశాల మాయం విషయంపై దర్యాప్తు ముమ్మరం అయ్యేలా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతానన్నారు. ఆలయంలో పార్కింగ్ సదుపాయం కల్పించాలని ఈవోను ఆదేశించారు. ఏటా సౌరయాగం జరిగేలా చూడాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
ముఖలింగేశ్వరుని దర్శించుకున్న మంత్రి
సారవకోట రూరల్ (జలుమూరు): మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వర స్వామిని శుక్రవారం మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి పక్కనున్న చక్రతీర్థంలో స్నానాలు ఆచరించేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని, కేశఖండన శాల, స్వామి వారి వాహనాలు భద్ర పర్చేందుకు గది నిర్మించాలని సిబ్బంది కోరగా సంబందిత శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపించాలని మంత్రి ఆదేశించారు.
శ్రీకూర్మనాథాలయంలో అన్నదాన సత్రం నిర్మిస్తాం
శ్రీకూర్మం (గార) : స్థానిక శ్రీకూర్మనాథాలయంలో భక్తులకు నిత్యాన్నదానం చేసేందుకుగానూ అన్నదాన సత్రం నిర్మిస్తామని మంత్రి మాణిక్యాలరావు హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన శ్రీకూర్మనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. సర్పంచ్ రామశేషు టీటీడీ సత్రం పరిస్థితిని మంత్రికి వివరించారు. ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్యెల్యే గుండ లక్ష్మీదేవి, ఈవో శ్యామలాదేవి పాల్గొన్నారు.