పాలకొండను నగర పంచాయతీగా ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తక్షణం కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ పరిపాలనా విభాగాలను ఆదేశించింది.
‘పాలకొండ’పై హైకోర్టు నోటీసులు!
Published Fri, Aug 16 2013 4:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
పాలకొండ, న్యూస్‌లైన్ : పాలకొండను నగర పంచాయతీగా ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తక్షణం కౌంటర్ దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ పరిపాలనా విభాగాలను ఆదేశించింది. ఈ విషయాన్ని నగర పంచాయతీ ప్రత్యేకాధికారి, శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్ గురువారం ‘న్యూస్‌లైన్’కు ధ్రువీకరించారు. పాల కొండ మేజర్ పంచాయతీని నగర పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో జీవో 90ను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ గత పంచాయతీ పాలకవర్గంలో వార్డు సభ్యురాలిగా పనిచేసిన సబ్బ విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ వాదన ఇదీ..
పాలకొండ మేజర్ పంచాయతీకి ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నాయని, నరసన్నపేట, టెక్కలి వంటి మేజర్ పంచాయతీలకు వార్షికాదాయం అధికంగా ఉన్నా వాటిని నగర పంచాయతీలుగా చేయకుండా పాలకొండను చేయడం ఎంతవరకు సమంజసమని పిటిషనర్ ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో 75 శాతం మేర వ్యవసాయ కూలీలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయని, పరిశ్రమలు లేవని, సినిమా థియేటర్లు స్వల్పంగా ఉన్నాయని, అడుగడుగునా గ్రామీణ వాతావరణం ఉట్టిపడుతుందని వివరించారు. తమ పాలకవర్గ హయాంలో నగర పంచాయతీగా స్థాయి పెంచాల్సిన అవసరం లేదని తీర్మానం చేసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. ప్రజల అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
రాజకీయాలే కారణాలతోనే స్థాయి పెంపు?
ఇదిలా ఉండగా, పాలకొండను నగర పంచాయతీగా ఏర్పాటు చేయ టం వెనుక రాజకీయ కారణాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీలో గతంలో 20 వార్డులుండగా, అప్పట్లో కాంగ్రెస్, టీడీపీల్లో ఉన్న 16 మంది వార్డు సభ్యులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మేజర్ పంచాయతీలో వైఎస్‌ఆర్‌సీపీ బలీయమైన శక్తిగా ఎదిగింది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే ఆ పార్టీ విజయం తధ్యమన్న భావనతో అధికార పార్టీకి చెందిన ముఖ్యులు నగర పంచాయతీగా ఏర్పాటు చేయించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సందిగ్దావస్థలో ప్రజలు..
నగర పంచాయతీ ఏర్పాటుపై పట్టణ ప్రజలు సానుకూలంగానే స్పందించారు. ఇప్పటికే రూ.2 కోట్ల నిధులు కూడా సమకూరాయి. త్వరలోనే ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఇప్పటికే వార్డుల విభజన, పోలింగ్‌స్టేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశాక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు నగర పంచాయతీ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఈ సమయంలో హైకోర్టు ఆదేశాలు రావటంతో ప్రజలు సందిగ్ధంలో పడ్డారు. పొరుగునే ఉన్న రాజాం 2005లో నగర పంచాయతీగా ఏర్పాటుకాగా, అప్పట్లో అక్కడి ప్రజలు కొందరు ఏర్పాటుపై కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటివరకు అక్కడ ఎన్నికలు జరగలేదని గుర్తు చేసుకుంటున్నారు. ఆ తరహా పరిస్థితులు పాలకొండకు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement