ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయం వద్ద కలెక్షన్ కింగ్
అవినీతిపై కరపత్రాలు వేసిందెవరూ..
దళారుల మధ్య విభేదాలే కారణమా?
పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా.. పట్టించుకోని అధికారులు
సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయంలో అవినీతి పేరుతో వేసిన కరపత్రాల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మల్లేపల్లె బసిరెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రహస్యంగా సమాచారం తెప్పించుకున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా ఆర్టీవో కార్యాలయ ఆవరణలోనే మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల కార్యాలయం ఉండటం.. అలాగే కొంత మంది సిబ్బంది వ్యవహార శైలి వల్ల వసూళ్ల పర్వం సాగుతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది కరెక్టు కాదని చెప్పే అధికారులు లేకపోవడంతో కొంత మంది సిబ్బంది ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది. దీంతో వాహనదారులు పెద్ద ఎత్తున సొమ్ము ముట్టజెప్పాల్సి వస్తోంది. అయితే కరపత్రాల వ్యవహారంపై డీటీసీ బసిరెడ్డి తెప్పించుకున్న సమాచారం మేరకు స్థానికంగా ఉన్న ఒక డ్రైవింగ్ స్కూలుకు చెందిన వ్యక్తే ఇదంతా చేయిస్తున్నట్లు తెలియ వచ్చినట్లు భోగట్టా.
కొంత మంది అధికారులపై ఎందుకు కరపత్రాలు వేయాల్సి వచ్చిందన్న ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. కొంత మంది దళారులను అధికారులు ప్రోత్సహిస్తుండటం.. మరి కొంత మందిని దూరంగా పెడుతున్న నేపథ్యంలోనే కరపత్రాలు వేసినట్లు తెలుస్తోంది. అధికారులు సమావేశం పెట్టుకొని సిబ్బంది పని తీరును ప్రశ్నించడమో.. లేక ఏమి జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకుని ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.
ఆర్టీవో కార్యాలయ గేటు బయటనే కొంత మంది దళారులు వాహనదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ‘లెసైన్స్ పరీక్ష పాస్ చేయిస్తాం.. ఆర్‌సీలు ఇప్పిస్తాం.. ఎఫ్‌సీలు తెప్పిస్తాం.. అధికారులను మ్యానేజ్ చేస్తాం’ అంటూ దళారులు వాహనదారులతో భారీగా వసూలు చేస్తున్నారు. ‘కరపత్రాల కలకలం’ పేరుతో సాక్షిలో ఇటీవల కథనం ప్రచురితం కావడంతో ఆర్టీవో రవూఫ్ దళారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో రవూఫ్ పని నిమిత్తం బయటకు వెళ్లగానే.. సమయం చూసుకొని దళారులు లోపలికి వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది క్లర్క్‌ల వద్ద అసిస్టెంట్ల రూపంలో ఉన్న దళారులు కూడా సాయంత్రం పూట లోపలికి వెళ్తున్నట్లు తెలియవచ్చింది. ఏదిఏమైనా దళారుల బెడదనుంచి వాహనదారులను రక్షించాలంటే అధికారులు సీరియస్‌గా తీసుకుంటే తప్ప న్యాయం జరగదని పలువురు పేర్కొంటున్నారు.
కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్న దళారి
ప్రొద్దుటూరు ఆర్టీవో కార్యాలయాన్ని వేదికగా చేసుకొని ఓ బ్రోకర్ కలెక్షన్ కింగ్‌గా మారాడు. అటు అధికారులకు పని చేసిపెట్టడంలో దిట్టగా మారడంతోపాటు.. కొంత మంది అధికారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు భోగట్టా. ప్రస్తుతం ఎఫ్‌సీలు ఇప్పించడంతోపాటు ఇతర వ్యవహారాల్లో పెద్ద ఎత్తున తీసుకుంటున్న ఆర్ అక్షరంతో మొదలయ్యే పేరు గల బ్రోకర్ కావాల్సినంత స్థాయిలో దోచుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్టీవో కార్యాలయ డ్రైవర్‌గా 30 ఏళ్ల క్రితం పని చేసిన ఇతను కొన్ని కారణాల వల్ల మానుకొని తర్వాత దళారి అవతారం ఎత్తాడు. ఇటీవలే కుమారుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఒక కారు గిఫ్టుగా ఇచ్చినట్లు బయట ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా అతని సతీమణి కూడా ఒక శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తోంది. ఇతను మాత్రం పెద్ద ఎత్తున ప్రొద్దుటూరు పట్టణంలోని పలువురు ఏజెంట్ల నుంచి మొత్తాలు సేకరించి పనులు చేసిన అధికారుల పనులను చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా కార్యాలయ పరిసరాలను నమ్ముకొని జీవితం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.