రెండు గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతం | Panchayat elections held peacefully in two villages | Sakshi
Sakshi News home page

రెండు గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతం

Published Thu, Oct 10 2013 3:11 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

Panchayat elections held peacefully in two villages

ఘట్‌కేసర్‌/ ఘట్‌కేసర్‌ టౌన్‌, న్యూస్‌లైన్‌: ఘట్‌కేసర్‌, ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. ఘట్‌కేసర్‌ లో 71.84 శాతం, ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో 75 శాతం పోలింగ్‌ నమోదైనట్టు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, ఎంపీడీఓ దేవసహాయం తెలిపారు. ఘట్‌కేసర్‌లోని 18 వార్డుల్లో కలిపి మొత్తం 16,116 ఓట్లుండగా 11,578 ఓట్లు పోలయ్యాయి. మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన 41 పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్‌ఎఫ్‌సీనగర్‌ గ్రామ పంచాయతీలో మొత్తం 3,111 ఓట్లు ఉండగా 2,330 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అయితే ఓటరు జాబితాలో తప్పులు దొర్లడంతో కొందరు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. జాబి తాలో పేరు రెండు సార్లు ఉండటంతో ఒకరిద్దరు రెండో సారి ఓటు వేయడానికి వచ్చి పోలీసులకు చిక్కారు. ఘట్‌కేసర్‌ సర్పంచ్‌గా అబ్బసాని యాదగిరి ఘట్‌కేసర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా అబ్బసాని యాదగిరి యాదవ్‌ 1,002 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అబ్బసాని యాదగిరి యాదవ్‌కు 6,171 ఓట్లు, బండారి శ్రీనివాస్‌కు 5,169 ఓట్లు, సాయినోజు మనోహరకు 39 ఓట్లు వచ్చాయి. మరో 199 ఓట్లు చెల్లలేదు.

ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ సర్పంచ్‌గా స్టీవెన్‌
ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా స్టీవెన్‌ 370 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. స్టీవెన్‌కు 1,239 ఓట్లు, కనపాల రాజేష్‌కు 869 ఓట్లు, డీవీరావుకు 196 ఓట్లు వచ్చాయి. 26 ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు. ఎన్‌ఎఫ్‌సీ పరిశ్రమకు చెందిన విశ్రాంత ఉద్యోగైన స్టీవెన్‌కు కాంగ్రెస్‌ పార్టీలోని కట్ట జనార్దన్‌రెడ్డి వర్గం, బీజేపీ నాయకుడు మైపాల్‌రెడ్డి, టీడీపీ నాయకుడు వెంకటేష్‌ ముదిరాజ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు బొక్కా ప్రభాకర్‌రెడ్డిలు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. 4

అటు వర్షం.. ఇటు విద్యుత్‌ కోత..
తాండూరు టౌన్‌ /మేడ్చల్‌, న్యూస్‌లైన్‌: ఓ వైపు జడివాన.. మరో వైపు విద్యుత్‌ కోత.. వెరసి బుధవారం జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నాలుగైదు రోజులుగా కరెంట్‌ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో సైతం విద్యుత్‌ కోత విధిస్తున్నారు. ఇదిలా ఉండగా తాండూరు, మేడ్చల్‌, వికారాబాద్‌, మోమిన్‌పేట, హయత్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన వర్షం.. రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో తాండూరు, మేడ్చల్‌ పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

మేడ్చల్‌ పట్టణంలోని వినాయక్‌నగర్‌, ఆర్టీసీ కాలనీ, బాలాజీనగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. స్థానిక అయ్యప్ప గుడి సమీపంలోని గ్రేస్‌వెల్‌ అనాథాశ్రమంలోకి నీళ్లు చేరడంతో పిల్లల దుస్తులు, దుప్పట్లు నీట మునిగాయి. చిన్నపాటి వర్షం కురిసినా భవనంలోకి నీరు చేరుతోందని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆశ్రమ నిర్వాహకుడు జాకబ్‌ చెప్పారు. విద్యుత్‌ కోత కారణంగా తాండూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement