ఔషధ పండు..ఆరోగ్యం మెండు..
నోరూరించే మిఠాయి తిందామంటే షుగర్.. వేడివేడి సమోసాలు ఆరగిద్దామంటే ఊబకాయం, రక్తపోటు భయం.. ఇలా ప్రజా జీవనంలో ఎన్నో ఆంక్షలు, టెన్షన్లు. మరి.. కంటికి నచ్చిన ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం నోరూరించే పండ్లే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. తక్కువ ధరలో అందుబాటులో లభించే రకరకాల పండ్లు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో లభించే పండ్లు, వాటిలోని ఔషధ గుణాలపై ప్రత్యేక కథనం.
- గుడివాడ అర్బన్
షుగర్‌కు విరుగుడు బత్తాయి
స్థూలకాయం, షుగర్ వ్యాధులతో బాధపడే వారికి బత్తాయి మంచి ఔషధం. రోజూ ఒక గ్లాసు బత్తాయి రసం తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. రక్తలేమి, ఇతర రుగ్మతలకు బత్తాయి మంచి ఔషధం. గర్భిణులకు, బాలింతలకు మంచి పోషకాహారమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్‌ను నిరోధించే ద్రాక్ష
ద్రాక్షలో ఉండే ఒక రకమైన ఆమ్లాలకు క్యాన్సర్‌ను అడ్డుకునే లక్షణాలు ఉన్నాయి. దీనిలోని ‘రిస్‌వెర్టాల్’ అనే పదార్థం గుండెజబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధనల్లో తేలింది. రక్తనాళాలు పూడుకుపోకుండా, గట్టి పడకుండా మేలు కలిగించేందుకు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది.
కర్బూజతో కిడ్నీలో రాళ్లు మాయం
కర్బూజ పండు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని వైద్యులు చెబుతున్నారు. అజీర్తి, ఎగ్జియా (చర్మవ్యాధి), మూత్రంలో మంట తదితర సమస్యలకు కూడా ఇది మంచి మందు. బాలింతలు కర్బూజ ఎక్కువగా తినడం వల్ల పసి పిల్లలకు పాలు పుష్కలంగా లభిస్తాయి.
విరేచనాలు, అల్సర్‌ను దూరంచేసే యూపిల్
యాపిల్ పండు రోజూ తినడం వల్ల అల్సర్, విరేచనాలు దరి చేరవు. దీనిలో సీ-విటమిన్, సెల్యులైజ్, చక్కెర పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఈ పండు చర్మానికి తేమను అందించి నిగారింపును కూడా ఇస్తుంది.
గొంతునొప్పి తొలగించే కొత్తిమీర
తరచూ గొంతునొప్పితో బాధపడేవారు ఓ గిన్నె నిండా కొత్తిమీర తీసుకుని అందులో నీళ్లు పోసి బాగా మరగబెట్టి వచ్చిన కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతునొప్పితో పాటు చిగురు, పంటి వాపులు కూడా మటుమాయమవుతాయి.
మొలలకు కాకర మంచి మందు
మొలల వ్యాధితో బాధపడే వారికి కాకరకాయ రసం దివ్య ఔషధం. కప్పు కాకరకాయ రసంలో చెంచా తేనె కలిపి నాలుగు నెలలు తాగితే బహిష్టు నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆయాసం, పొట్టలోని కురుపులు మాయమవుతాయి. కాకర రసంలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగితే రక్తగడ్డలు, తామర, గజ్జి, దురద నయమవుతాయి.
పండ్లు, ఆకుకూరలతో చక్కటి ఆరోగ్యం..
రోజూ పండ్లు, ఆకుకూరలు తింటే మీ ఆరోగ్యాన్ని మీరే రక్షించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ఆరోగ్య సూత్రాలు పాటించాలి. వయసుతో సంబంధం లేకుండా పండ్లు, ఆకుకూరలు తినడం వల్ల జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. పండ్లయినా, ఆకుకూరలైనా నీటిలో శుభ్రం చేసిన తరువాతే తినడం మంచిది.
- గుజ్జుల సుధాకర్‌బాబు, హోమియో వైద్యుడు, గుడివాడ