సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) 58 పేజీల నివేదికను ప్రభుత్వానికి సోమవారం సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో అనేక అంశాలపై సమగ్రంగా విశ్లేషణ చేయడంతోపాటు పాఠశాల స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమం ఎంత అవసరమో నొక్కి చెప్పింది. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కావాలనే విషయమై ప్రభుత్వం ఇటీవలే విద్యార్థుల తలిదండ్రుల నుంచి లిఖితపూర్వక ఆప్షన్లను సేకరించగా.. 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలని కోరిన సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు వీలుగా సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలని ఎస్‌సీఈఆర్‌టీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎస్‌సీఈఆర్‌టీ సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం.
నివేదికలో ఏముందంటే..
► అన్ని రకాల సమగ్ర విశ్లేషణల అనంతరం ఎస్‌సీఈఆర్‌టీ ఈ దిగువ విషయాలను నివేదికలో పొందుపర్చినట్లు తెలిసింది. విద్యార్థులు మాతృభాషలో ప్రావీణ్యం పొందేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని సిఫార్సు చేసింది. దీని ద్వారానే అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ వివరాలిలా.
► ఆంగ్ల మాధ్యమం వల్ల విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు, ప్రమాణాలు అభివృద్ధి చెందుతాయి.
► దీనివల్ల రాజ్యాంగం నిర్దేశించిన విలువలు విద్యార్థుల్లో పెరుగుతాయి. విద్యార్థుల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది.
► శారీరక, మానసిక సామర్థ్యాల పెంపు దిశగా.. విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. అభ్యసనం అనేది వివిధ ప్రక్రియలను చేపట్టడం ద్వారా కొనసాగాలి.
► విద్యార్థుల్లో ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తమ భావాలను స్వేచ్ఛగా.. తడబాటుకు తావు లేకుండా చెప్పగలగాలి.
► నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో విద్యార్థులు సాధిస్తున్న జ్ఞాన సముపార్జనను ఎల్లప్పుడూ పర్యవేక్షించటం ద్వారా వారిలో సామర్థ్యాలు ఏ మేరకు పెరుగుతున్నాయో కూడా తెలుసుకోవచ్చు.
► ఈ దృష్ట్యా ప్రభుత్వం 1నుంచి 10 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశలవారీగా ప్రవేశ పెట్టాలి.
► ఇందుకు సంబంధించి ఎస్‌సీఈఆర్‌టీ 1నుంచి 6వరకు ఆంగ్ల మాధ్యమం పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేయించింది.
► ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా మాధ్యమం స్కూళ్లు యథాతథంగా కొనసాగుతాయి. ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చు.
► తెలుగు సబ్జెక్టును 1నుంచి 10 తరగతి వరకు తప్పనిసరిచేస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఎస్‌సీఈఆర్‌టీ తెలుగు సబ్జెక్టు పాఠ్య పుస్తకాలను ఇప్పటికే పునర్నిర్మితం చేసి మాతృభాష మరింత పటిష్టమయ్యేలా తీర్చిదిద్దింది.
► బోధనాభ్యసన ప్రక్రియలను పరిపుష్టం చేయడం, ప్రభుత్వ పథకాల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పర్చడం వంటి చర్యలు ఫలితాలిస్తాయి.
► విద్యార్థులకు వర్క్ బుక్స్, స్కూల్ కిట్స్, అభివృద్ధిపర్చిన పాఠ్య పుస్తకాలు, పౌష్టికతతో కూడిన మధ్యాహ్న భోజనం వంటివి దీనికి మరింత తోడ్పాటునిస్తాయి.
► ఐసీటీ వేదికల ఆధారంగా టీచర్ల సామర్థ్యాలు పెంచేందుకు వీలుగా వారికిచ్చిన అనేక శిక్షణ కార్యక్రమాలు ఇందుకు ఉపకరిస్తాయి.
► తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థులు పురోగతిపై వారికి వివరిస్తూ చర్చిస్తూ ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment