రక్తం పీల్చేస్తున్నారు! | parents are troubled due to wrong Lab Report | Sakshi
Sakshi News home page

రక్తం పీల్చేస్తున్నారు!

Published Wed, Sep 10 2014 12:36 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

parents are troubled due to wrong Lab Report

సాక్షి, చిత్తూరు: కార్వేటి నగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్నారి అముద(7)కు రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం సోకింది. చికిత్స కోసం వారి తల్లిదండ్రులు చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తంలో తెల్లకణాలు భారీగా తగ్గి 39వేలు మాత్రమే ఉన్నట్లు ల్యాబ్‌రిపోర్టు ఇచ్చారు. వేలూరు లేదా చైన్నై తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో చెన్నై తీసుకెళ్లారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో  పరీక్షలు చేయించారు. రక్తకణాలు సాధారణ స్థితిలో ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. చిత్తూరు-చెన్నై సంఘటన సమయంలో తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లి ఉంటారు.
 
డెంగీ పేరుతో చికిత్స చేసి ఉంటే ఎంత నష్టపోతారు?
ఈ ఒక్క ఉదాహరణ చాలు డెంగీ పేరిట జిల్లా లో నిర్వహిస్తున్న రక్త పరీక్షలు రోగుల్ని ఏవిధంగా కలవరపెడుతున్నాయో. ప్లేట్‌లెట్ల సంఖ్య క్షణక్షణానికీ వేల సంఖ్యలో మార్పు వస్తుండటంతో ఏ ల్యాబ్ రిపోర్ట్ కరెక్టో తెలీక రోగులు ఆందోళన పడుతున్నా రు. ఇక పరీక్షల పేరుతో వేలకు వేలు ల్యాబ్‌ల్లో లాగుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో నాణ్యమైన చికిత్స అందక తప్పని పరిస్థితుల్లో రోగులు ప్రైవేటు బాట పట్టాల్సి రావడం, అక్కడికి వెళితే తప్పుడు రిపోర్టు లు..అధిక ఫీజులతో రోగులు బెంబేలెత్తిపోతున్నారు.
 
ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్లు ఎక్కడ?
జిల్లాలో చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో అక్కడే ల్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే చాలా వాటికి వైద్య, ఆరోగ్యశాఖ గుర్తింపు లేదు. ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ లేకుండానే ల్యాబ్‌లను నడుపుతున్నారు. నిపుణులైన టెక్నీషియన్లు లేరు. ఎంఎల్‌టీ చేసిన ఓ వ్యక్తి పేరుతో అనుమతి తెచ్చుకుని అరకొర పరీక్షలు చేయడం వచ్చిన ‘ల్యాబ్‌బాయ్స్’తో  పరీక్షలు చేయిస్తున్నారు. దీంతోనే తప్పుడు రిపోర్టులు వస్తున్నాయి. ఈ పరిస్థితి తరచూ ఎదురవుతున్నా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టడం, అనుమతులు లేనివాటిని సీజ్ చేసేందుకు ఉపక్రమించడం లేదు. దీనికి కారణం ల్యాబ్ ఏర్పాటు సమయంలో అధికారులకు మామూళ్లు ఇచ్చుకోవడం, ఆపై ప్రతినెలా పంపకాల ప్రక్రియ నిర్విరామంగా సాగుతుండటమే! అలాగే జిల్లాలోని కొంతమంది ప్రైవేటు వైద్యులు కూడా కాసులకు ఆశపడి ఎక్కువ కమీషన్ ఇచ్చే ల్యాబ్‌లకు రిపోర్టులు రాసిస్తున్నారు. దీంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది.
 
పెద్ద ఆస్పత్రుల నుంచి పెద్ద కమీషన్లు
డెంగీ, విష జ్వరాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. డెంగీతో పుత్తూరు, చిత్తూరు రూరల్ మండలంలో 5 మంది ఈ ఏడాది మృత్యువాతపడ్డారు. అయినా అధికారుల్లో అప్రమత్తత కొరవడింది. ప్రజల ప్రాణాల మీద కొచ్చినప్పుడు ఓ వైద్యశిబిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో సర్కారు వైద్యంపై సామాన్యుడికి భరోసా కరువైంది. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో జిల్లాలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి విషజ్వరాలు ముసురుకుంటున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు వైద్యులు జ్వరం, ఒళ్లునొప్పులనగానే డెంగీ లక్షణాలంటూ భయపెడుతున్నారు. ఇక్కడ పరీక్షల నిమిత్తం 600-1000 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. ఖర్చు ఎంతయినా ఫర్వాలేదనే వారిని తిరుపతి, చెన్నై ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. వీరు సిఫార్సు చేసే ఆస్పత్రుల నుంచి భారీగా కమీషన్లు దండుకుంటున్నారు.
 
1000-1500 రూపాయల వరకూ వసూళ్లు
ప్రస్తుతం జిల్లాలో కొన్ని రక్తపరీక్ష కేంద్రాల్లో ర్యాపిడ్‌కిట్ సాయంతో డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జాతీయ వైరాలజీ సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఎలీసా పరీక్షలో నిర్ధారణ అయితేనే డెంగీగా పరిగణించాలి. ఇది కేవలం జిల్లాలో రుయాతో పాటు మరో ప్రముఖ వైద్యశాలలో మాత్రమే ఉంది. అయితే కొందరు ప్రైవేటు కేంద్రాల నిర్వాహకులు వైద్యులు కనుసన్నల్లో ప్రత్యేక కిట్ల ద్వారా నామమాత్రపు పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు 200 వసూలు చేయాల్సి ఉంటే 1000-1500 రూపాయల వరకూ గుంజుతున్నారు. రుయాలో ప్లేట్‌లెట్ కౌంటింగ్ మిషన్ ఉంది. అయితే చాలామంది ప్రైవేటు డాక్టర్లు వ్యాధి తీవ్రత భయంకరంగా ఉందంటూ రోగులను భయపెట్టి ప్రైవేటుకు సిఫార్సు చేస్తున్నారు.
 
డెంగీ లక్షణాలు ఇలా
డెంగీ జ్వరం వల్ల తలనొప్పి, కంటి వెనుకనొప్పి, కండరాల నొప్పులతో శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోతుంటే ముక్కు, నోరు, చిగుళ్లు వెంట రక్తం రావడం, వాంతులు, మలం నల్లగా ఉండటం, నిద్రలేమి, శ్వాసలో ఇబ్బంది, పొత్తి కడుపునొప్పి, నాలుక తడారడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement