వీనస్‌క్లాట్ ప్రివెంటర్
సాక్షి, హైదరాబాద్: ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మోకాలు, మోచేతుల కండరాలు తీవ్ర ఒత్తిడికిలోనై రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి గట్టిగా బిగుసుకుపోతాయి. దీంతో రక్తం సరఫరా నిలిచిపోయి తిమ్మిర్లు వస్తాయి. దీనికితోడు శరీరంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువైనప్పుడు గడ్డలు ఏర్పడి సిరలు బయటికి ఉబ్బినట్లు కన్పిస్తాయి. వీటిని సకాలంలో గుర్తించకపోతే.. రక్తం సరఫరా లేక కాలిపాదాలు చచ్చుబడి చివరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులను ముందే గుర్తించే అత్యాధునిక ‘వీనస్ క్లాట్ ప్రివెంటర్’ను రూపొందించాడు బయోమెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థి మనోజ్‌ఖన్నా. ఈ వీనస్‌క్లాట్ ప్రివెంటర్‌ను బీపీ మానిటర్, గ్లూకోమీటర్ మాదిరిగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించి పరీక్షలు చేసుకోవచ్చు.
ప్రాజెక్ట్ వర్క్ కోసం రూపకల్పన..
నాంపల్లికి చెందిన మనోజ్‌ఖన్నా ప్రస్తుతం ఈస్ట్ మారేడుపల్లిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కొత్తగా ఆలోచించడం, ఎలక్ట్రానిక్ వస్తువులను రూపొందించడంపై అతడికి ఆసక్తి ఉంది. కాలేజీ ప్రాజెక్ట్‌వర్క్‌లో భాగంగా పాదాలు, చేతులకు సంబంధించిన రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను గుర్తించే డివైజ్‌ను రూపొందించాలని భావించాడు. విద్యార్థులకు ట్యూషన్ చెప్పగా వచ్చిన రూ.25 వేలు ఖర్చు చేసి డిజిటల్ సీఆర్‌వో(కాథోడ్ రే ఒస్సిల్లోస్కోప్)ను సమకూర్చుకున్నాడు. 8 నెలలు కష్టపడి ‘వీనస్ క్లాట్ ప్రివెంటర్’ను రూపొందించాడు. దీన్ని సీఆర్‌వోకు అనుసంధానించాడు. ఈ ప్రివెంటర్ సెన్సర్‌ను పాదాలు, చేతులపై ఉంచి సంకేతాలను నమోదు చేశాడు. పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ‘డీప్‌వేయిన్ త్రోంబసిస్’తో బాధపడుతున్న 20 మంది బాధితులపై పరీక్షించగా మంచి ఫలితాలొచ్చాయి. ఈ వీనస్ క్లాట్ ప్రివెంటర్‌ను మహారాష్ట్రలోని కేకేవార్ వర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, ఉస్మానియా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ సహా నగరంలోని పలు ఇంజనీరింగ్ కాలేజీల టెక్ ప్రదర్శనల్లో పెట్టగా అందరి మన్ననలు వచ్చాయి.
పేటెంట్ రైట్స్ కోసం ప్రయత్నం
ఐటీ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారు, వాహనాల డ్రైవర్లు ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చుంటారు. దీని వల్ల మోకాలు కింద భాగంలోని కండరాలు తీవ్ర ఒత్తిడికిలోనై రక్తం సరఫరా నిలిచిపోయి తిమ్మిర్లు వస్తుంటాయి. దీనికితోడు శరీరంలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎక్కువైనప్పుడు గడ్డలు ఏర్పడి సిరలు ఉబ్బినట్లు కన్పిస్తాయి. రక్తం సరఫరా లేక పాదాలు చచ్చుబడిపోతాయి. ఈ వ్యాధిపై అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తే చివరికి కాలును పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. ఒక్కోసారి కార్డియాక్ అరెస్ట్‌కు గురి కావాల్సి రావచ్చు. ఈ తరహా కేసులు ఇటీవల బాగా పెరిగాయి. ఇవే ‘వీనస్ క్లాట్ ప్రివెంటర్’రూపకల్పనకు పురికొల్పాయని, ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదని మనోజ్ చెప్పాడు. సాధారణంగా ఇలాంటి కేసులను అల్ట్రాసౌండ్, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా గుర్తిస్తారు. అయితే ఈ పరీక్షలకు అధిక సమయం పట్టడంతో పాటు ఖర్చుతో కూడినవి. అదే ఈ వీనస్‌క్లాట్ ప్రివెంటర్‌ను బీపీ మానిటర్, గ్లూకోమీటర్ మాదిరిగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. దీనికి త్వరలోనే పేటెంట్ హక్కులు లభించే అవకాశం ఉంది.
మరో ప్రాజెక్ట్‌లో నిమగ్నం
ప్రొఫెసర్ కె.సుజాత, ప్రొఫెసర్ వెంకటేశ్వర్‌రావు మార్గదర్శకత్వంలో దీనిని రూపొందించాను. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రతి విద్యార్థి శిక్షణ పూర్తి చేయాలి. కానీ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ సహా మరే ఇతర ఆస్పత్రిలో బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ విభాగం ఏర్పాటు చేస్తే.. నాలాంటి వారికి ఉపయోగకరం. ప్రస్తుతం ‘మైండ్ మ్యాపింగ్’ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాను. తరగతిలో టీచర్ చెప్పింది ఏ మేరకు పిల్లలకు అర్థమయ్యిందో గుర్తించే పరికరాన్ని కూడా రూపొందిస్తున్నాను.
– మనోజ్‌ఖన్నా
Comments
Please login to add a commentAdd a comment