ఇసుక దందా.. అక్రమంగా మట్టి తవ్వకాలు.. ఉద్యోగుల బదిలీలు.. ఇలా ఎక్కడ కాసులు రాల్తాయో అక్కడ వాలిపోతున్న టీడీపీ నేతలు చివరకు తుక్కు ఇనుము...
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఇసుక దందా.. అక్రమంగా మట్టి తవ్వకాలు.. ఉద్యోగుల బదిలీలు.. ఇలా ఎక్కడ కాసులు రాల్తాయో అక్కడ వాలిపోతున్న టీడీపీ నేతలు చివరకు తుక్కు ఇనుము వేలంలోనూ అక్రమాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. పాత రోడ్డు రోలర్ల వేలంలో టెండర్లను ఏకపక్షంగా దక్కిం చుకునేందుకు అధికారులను టీడీపీ నేతలు కొందరు తీవ్ర ఒత్తిళ్లకు గురి చేసినట్టు సమాచారం. విషయంలోకి వెళితే.. కాలం చెల్లిన రోడ్డు రోలర్లను వేలం వేయాలని పంచాయతీరాజ్ అధికారులు నిర్ణయించారు.
ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమడోలు సబ్ డివిజన్ల పరిధిలో నాలుగు రోడ్డు రోల ర్లను అమ్మకానికి పెడుతూ టెండర్లను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి ఈనెల 6వ తేదీన టెండర్ కం ఆక్షన్ నోటీసు జారీ చేశారు. ఒక్కొక్క రోడ్డు రోలర్ విలువ (రిలీజ్ వేల్యూ)ను రూ.1.50 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో పాల్గొనేవారు అందులో 25 శాతం మార్జిన్ మనీగా రూ.37,500 చెల్లించాలని పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా టెండర్ దాఖలు చేసేం దుకు వెళ్లిన వారికి మాత్రం అధికారులు చుక్కలు చూపించారు.
టెండర్ దాఖలు గడువు ఈనెల 24వ తేదీ కావడంతో మంగళవారం సాయంత్రం మార్జిన్ మనీ డీడీలు కట్టి ఆఫీసుకు వెళ్లిన వారిని అధికారులు లోనికి రానివ్వలేదు. ఏ ఒక్కరి టెండరు స్వీకరించలేదు. ఎవరూ టెండర్లు వేయవద్దని కరాఖండీగా తేల్చేశారు. ‘డీడీలు తీసుకొచ్చాం.. ఇదేంటి’ అని ప్రశ్నించిన ఓ ఇనుము వ్యాపారితో స్వయంగా సదరు శాఖ అధికారులు ‘ఏం చెప్పమంటారు. మా సమస్యలు మాకున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి’ అని మొరపెట్టుకున్నారని సమాచారం. అధికారులు ఇలా టెండర్ షెడ్యూళ్లు నిరాకరించడం వెనుక పెద్ద కథే ఉందంటున్నారు.
ఆయకొకటి.. ఈయనకు మూడు
8 టన్నుల బరువుండే ఒక్కో రోడ్డు రోలర్‌ను తుక్కు ఇనుము కింద అమ్మినా బాగానే గిట్టుబాటవుతుందని వ్యాపారుల వాదన. తక్కువలో తక్కువగా కిలో ఇనుము రూ.30 చొప్పున లెక్క గట్టినా ఒక్కొక్క రోడ్డు రోలర్ విలువ రూ.2 లక్షల 40 వేలు ఉంటుంది. అయితే, పంచాయతీరాజ్ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఒక్కొక్క రోలర్‌ను కేవలం రూ.లక్షా 50 వేలకే కట్టబెట్టేశారు.
ఏలూరు సమీపంలోని ఓ ఎమ్మెల్యే బినామీగా అందరూ చెప్పుకునే వ్యక్తికి ఒక రోడ్డు రోలర్‌ను, ఓ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి అనుచరుడికి ఏకంగా మూడు రోడ్డు రోలర్లను అప్పనంగా ఇచ్చేశారని అంటున్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇరువురి టీడీపీ నేతలకు పంచాయతీరాజ్ అధికారులు రోడ్డు రోలర్ల పంపకాలు చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరినీ టెండర్లు వేయించకుండా ఏకపక్షంగా వాటిని కట్టబెట్టాలనుకున్న ప్పుడు పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం ఎందుకు, ఓపెన్ ఆక్షన్ అని హడావుడి చేయడం ఎందుకు అన్నదే వ్యాపారుల వాదన.