రాష్ట్ర విభజనపై ఉద్యమం
Published Fri, Dec 6 2013 4:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:ఆంధ్రప్రదేశ్ విభజనపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవో సంఘ సహాధ్యక్షుడు చౌదరి పురుషొత్తమనాయుడు హెచ్చరించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వైఎస్‌ఆర్ కూడలి వద్ద గురువారం దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీమాంధ్రలోని అన్ని ప్రాంతాల్లో జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడుతున్నట్టు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం గతంలో 66 రోజులు సమ్మె చేసి న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిలో ఏమాత్రం మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. డిసెంబర్ 9న యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజు తెలుగుజాతి విద్రోహదినంగా భావించి జిల్లాలోని ఉద్యోగులు, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక సభ్యులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామన్నారు. కేంద్రప్రభుత్వ కార్యాకలాపాలు స్తంభింపచేస్తామన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ కేవలం ఓటుబ్యాంకు రాజకీయా ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాలకు అనుగుణం గా నడుచుకోవాలన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తూ టీ నోట్ పెట్టిన వెంటనే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామన్నారు. విభజన జరిగితే ఎక్కువగా నష్టపోయేది విద్యార్థులేనన్నారు. కార్యక్రమంలోవేదిక కో-కన్వీనర్ కొంక్యాన వేణు, ప్రతినిధులు కిలారి నారాయణరావు, ఎస్.వి.ఎస్.ప్రకాష్ ప్రసంగించారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధు లు దుప్పల వెంకటరావు, కె. దిలీప్, పూజారి జానకిరాం, పి.జయరాం, ఆర్.వేణుగోపాలరావు, వై.ఉమామహేశ్వరరావు, బమ్మిడి నర్సింగరావు, శోభారామకృష్ణ, ఎం.ఆర్.కె.దాస్, అధిక సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి జేఏసీ పిలుపు
శ్రీకాకుళం : రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల బంద్‌కు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది.
నేటినుంచి విద్యుత్ జేఏసీ నిరసన
రాష్ట్ర విభజనను నిరసిస్తూ శుక్రవారం నుంచి ఆదివారం వరకూ విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రతినిధులు నిర్ణయించారు. అలాగే ఏడో తేదీన జేఏసీ ప్రతినిధులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. తొమ్మిదో తేదీన హైదరాబాద్‌లో 13 జిల్లాల నాయకులు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
చరిత్రలో చీకటి రోజు
రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం ఘోరం. ఈ రోజు చరిత్రలో చీకటి రోజు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్ర ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ప్రజలు చివరివరకు పోరాడాలి. - ధర్మాన కృష్ణదాస్, నరసన్నపేట ఎమ్మెల్యే
వ్యక్తుల నిర్ణయం వల్లే ఈ దుస్థితి
ఎస్‌ఆర్‌సీ వంటి వ్యవస్థలు చేయాల్సిన నిర్ణయాల ను వ్యక్తులు తీసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వ్యక్తులు తీసుకున్న నిర్ణయం వల్లే ఒకేరోజున సీడబ్ల్యూసీ, యూపీఏ మిత్రపక్షాలు, కోర్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఇలాంటివన్నీ జరుగుతాయని ముందుగానే ఊహిం చాం. అందుకనే తొలినుంచి ప్రజలను మభ్యపెట్టే ప్రకటన చేయలేదు. ఈ నిర్ణయానికి పర్యవసానాన్ని ఆ వ్యక్తులు తర్వాత అనుభవిస్తారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా సీమాంధ్ర వాసులు, తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న వారు అత్యంత దురదృష్టవంతులు. - ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం ఎమ్మెల్యే, మాజీ మంత్రి
రాజకీయ నాయకులదే బాధ్యత
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం దారుణం. దీనికి సీమాంధ్ర రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. ఆరుకోట్ల సీమాంధ్రుల మనోభావాలను కాదని, కేవలం మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోరిక మేరకు విభజన చేయడం సరికాదు. సీమాంధ్రలో సరైన నేత లేకపోవడం మన దురదృష్టం. రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకు రాకుండా ఎవరి ఎజెండాతో వారే వెళ్లినందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
-హనుమంతు సాయిరాం,
ఏపీఎన్‌జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు
Advertisement