జిల్లాలోని రెండు పట్టణాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో అంతర్భాగం కానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న పటాన్‌చెరు, రామచంద్రాపురం పట్టణాలు ఉమ్మడి రాజధానిలో పరిధిలోకి వస్తాయి.
పటాచెరు, న్యూస్‌లైన్ :
జిల్లాలోని రెండు పట్టణాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో అంతర్భాగం కానున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న పటాన్‌చెరు, రామచంద్రాపురం పట్టణాలు ఉమ్మడి రాజధానిలో పరిధిలోకి వస్తాయి. కేబినెట్ ఆమోదించిన జీహెచ్‌ఎంసీ పరిధిలోకి ఈ రెండు పట్టణాలు కాస్మోపాలిటన్ నగరాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 2004 వరకు ఈ రెండూ సంగారెడ్డి నియోజకవర్గంలో ఉండేవి. ఆ తరువాత జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో పటాన్‌చెరు పరిధిలోకి వచ్చాయి. 2004 వరకు పంచాయతీలుగా ఉన్న ఈ పట్టణాలు 2006 జూన్‌లో జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యాయి. మహానగరంలో 150 డివిజన్లు ఉండగా రామచంద్రాపురం - 115, పటాన్‌చెరు - 116వ డివిజన్లుగా ఏర్పడ్డాయి.
పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని పారిశ్రామికవాడల్లో పనిచేసే కార్మికులు ఈ రెండు పట్టణాల్లో ఉంటున్నారు. పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడే ఈ రెండు పట్టణాలు బాగా అభివృద్ధి చెందగా.. గ్రేటర్‌లో విలీనం అయ్యాక అభివృద్ధి కుంటుపడింది. ఇదిలా ఉండగా.. ఉమ్మడి రాజధానిలో ఎంత మేరకు నష్టం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాజధాని లాభనష్టాలు ఇప్పుడేమీ చెప్పలేకపోయినా అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుందని స్థానిక రాజకీయవేత్తలు అంటున్నారు. పంచాయతీలుగా ఉన్నప్పుడు పాలనలో కూడా ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేది.
గ్రేటర్‌లో ఇప్పుడైతే తమ సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని కార్పొరేటర్లు తమ ప్రైవేటు సంభాషణల్లో అంటుంటారు. అదృష్టంగా హెచ్‌ఎండీఎ పరిధి కాకుండా జిల్లాలోని రెండు పట్టణాలే ఉమ్మడిలో చేరడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఉమ్మడి’గా హెచ్‌ఎండీఏ పరిధిని కేటాయిస్తారని గతంలో పుకార్లు వచ్చాయి. గ్రేటర్ కాకుండా హెచ్‌ఎండీఏ పరిధిని ఉమ్మడిగా చేసి ఉంటే జిల్లాలోని 10 మండలాలు అంటే 254 గ్రామాలు అందులోకి వెళ్లేవి. ఇది జిల్లాకు ఎంతో నష్టం చేకూర్చేదిగా ఉండేది.