పెదబయలులో నకిలీ రూ.వెయ్యి నోట్లు
- కిరాణా వ్యాపారికి టోకరా
- చలామణి వెనక గంజాయి స్మగ్లర్లు
- నష్టపోతున్న గిరిజనులు
పెదబయలు, న్యూస్‌లైన్: మన్యంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి ఎక్కువగా సాగుతోంది. మన్యంలో ప్రస్తుతం గంజాయి, గిరిజనులు పండించి పంటల అమ్మకాల సీజన్ కావడంతో స్మగ్లర్లు నకిలీ నోట్లను గుట్టుగా చలామణి చేస్తున్నారు. గతంలో మన్యంలో రూ.100, రూ.500 నకిలీ నోట్లు ఉండేవి. ప్రస్తుతం రూ.వెయ్యి విలువైన నోట్లు కూడా చలామణిలో ఉన్నాయి. పెదబయలు మండల కేంద్రం లోని ఓ కిరాణా వ్యాపారికి ఆదివారం రెండు రూ.వెయ్యి నోట్లు వచ్చాయి. అవి అసలైన నోట్లని భావించిన ఓ గిరిజన రైతు తీసుకొచ్చాడు.
చివరకు అవి నకిలీవనితెలిసి బాధపడ్డాడు. గత వారం పెదబయలు వారపు సంతల్లో పిప్పళ్లను విక్రయించినప్పుడు ఈ నోట్లు ఇచ్చారని న్యూస్‌లైన్ ముందు వాపోయాడు. వారపు సంతలు, కుగ్రామాల్లో గంజాయి విక్రయించే రైతులకు కూడా స్మగర్లు నకిలీ నోట్లను ముట్టజెబుతున్నారు. వారపు సంతల్లో పసుపు, పిప్పళ్లు విక్రయించే రైతులకు వస్తున్న డబ్బులో కూడా ఇవి ఉంటున్నాయి. పోలీసులు స్పందించి నకిలీ నోట్ల ముఠాను పట్టుకుని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.