
పెదమద్దాలి నుంచి ఢిల్లీకి
కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కించుకొని సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన యలమంచిలి సత్యనారాయణ చౌదరి
- సుజనాచౌదరి ప్రస్థానం
వ్యాపారవేత్తగా మొదలై.. కేంద్ర మంత్రిగా ఎదిగి..
జిల్లాలో వ్యక్తిగత పరిచయాలు తరలివెళ్లిన రాజకీయ నేతలు
విజయవాడ : కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కించుకొని సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) జిల్లా వాసే. వ్యాపారవేత్తగా జీవితం ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన అనతికాలంలోనే కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉండటం వల్లే ఆయనకు ఈ పదవి లభించిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో కోస్తా జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపిక, వారి విజయంలో ఎంపీ సుజనాచౌదరి కీలకపాత్ర పోషించారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో టీడీపీ జిల్లా పరిశీలకుడుగా కూడా పనిచేశారు. పార్టీ విజయం సాధించిన తరువాత కొత్త రాష్ట్రం ఏర్పాట్లలోనూ ఆయన చంద్రబాబుకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. దీంతో ఆయన నూతన రాజధాని అభివృద్ధి కమిటీలోనూ కీలక వ్యక్తిగా మారారు.
పెదమద్దాలి నుంచి ప్రస్థానం...
సుజనాచౌదరి స్వస్థలం పామర్రు మండలం పెదమద్దాలి. ఆయన తల్లిదండ్రులు జనార్ధనరావు, సుశీలకుమారి. వారి నాలుగో సంతానంగా 1961 జూన్ రెండున ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (వైఎస్ చౌదరి) కాగా, ఆయన్ని చిట్టిబాబు అని కూడా పిలుస్తారు. విజయవాడ మాంటిస్సోరి విద్యాసంస్థల్లో ప్రాథమిక విద్య, కోయంబత్తూరులోని పీఎస్‌జీ కళాశాలలో ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. తల్లిదండ్రుల పేరులోని మొదటి అక్షరాలతో సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను స్థాపించిన తరువాత ఆయన సుజనాచౌదరిగా మారారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ.190 కోట్లు. భార్య వై.పద్మజ. కుమారుడు కార్తీక్ యూఎస్‌లో ఇంజనీరింగ్ చదవి తండ్రి వ్యాపారాల్లోకి రాబోతున్నారు. కుమార్తె చాందిని. ఆయనకు జితిన్ కుమార్, శివరంగప్రసాద్, శివప్రసాద్, శివరామకృష్ణ అనే సోదరులు, ధనలక్ష్మి అనే సోదరి ఉన్నారు. 2010 జూన్ 22న తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2012 ఆగస్టు నుంచి పార్లమెంటరీ ఇంధన వనరుల కమిటీలో సభ్యుడుగా ఉన్నారు.
హర్షాతిరేకాలు...
సుజనా చౌదరికి కేంద్ర మంత్రి పదవి లభించడంతో టీడీపీలో, ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండే పలువురు నేతలు ఆయన్ని అభినందించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని శ్రీనివాస్ (నాని) అక్కడే ఉండగా, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్, పారిశ్రామిక వేత్త వసంత కృష్ణప్రసాద్ తదితరులు ఢిల్లీలో సుజనాచౌదరిని కలిసి అభినందించారు.