
ఒంగోలు టౌన్ సామాజిక భద్రత పింఛన్లను పదిరెట్లు పెంచామంటూ రాష్ట ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకొంది. ఆ ప్రకటనను చూసి పింఛన్లకు అర్హులైన వారు వాటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళితే వెబ్‌సైట్ రూపంలో ప్రభుత్వం మోకాలడ్డుతోంది. తాత్కాలికంగా పనిచేయడం లేదు (టెంపరరీ అన్ అవైలబుల్) అంటూ వెబ్‌సైట్‌లో ఉండటంతో ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. ఎన్నికల పింఛన్లలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పితలాటకం ఆడుతోందంటూ పలువురు అర్హులైన లబ్ధిదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. పది రెట్లు పింఛన్ పెంచామని చెబితే వాటిని పొందేందుకు ఆశగా వెళిన తమకు నిరాశ ఎదురవుతోందని వాపోతున్నారు. ఒంగోలు నగర పా లక సంస్థ పరిధిలో ఇప్పటివరకు 15వేల మంది పింఛన్లు పొందుతున్నారని, జనవరిలో జరిగిన జన్మభూమిలో మరో వెయ్యి పింఛన్లు మంజూరు చేశామంటూ నగర పాలక సంస్థ అధికారులు ప్రకటించారు. అయితే కొత్తగా మంజూరు చేసిన ఆ వెయ్యి పింఛన్లలో అగ్రభాగం అధికారపార్టీ ముద్ర పడిన వారివి ఉన్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ విమర్శలకు బలం చేకూర్చే విధంగా పింఛన్ల కోసం నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారులు తిరుగుతూనే ఉన్నారు.
పది రెట్లు ఇవే..
సామాజిక భద్రత పింఛన్లు అయిన వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, చేనేత, ఒంటరి, మత్స్యకార, గీత కార్మికులు, చర్మకారులు, డప్పుకారులు, హిజ్రాలు, డయాలసిస్‌తో బాధపడుతున్న వారికి ప్రతినెలా అందించే పింఛన్లను రెట్టింపు చేశామంటూ చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ప్రకటించేశారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండగా గుర్తుకురాని పదిరెట్ల పింఛన్ ఎన్నికలు సమీపించడంతో హడావుడిగా ప్రకటన చేశారు. ఇప్పటివరకు వృద్దాప్య, వితంతు, చేనేత, ఒంటరి, మత్స్యకార, గీతకార్మిక, చర్మకారులు, 79 శాతంలోపు వికలాంగత్వం ఉన్నవారికి 1000 రూపాయల చొప్పున పింఛన్లు అందిస్తున్నారు. అయితే ఆ 1000 రూపాయలను 2000 రూపాయలుగా పెంచుతున్నట్లు చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అదేవిధంగా 80శాతం పైగా వికలాంగత్వం ఉంటే 1500 రూపాయలు, హిజ్రాలకు 1500 రూపాయల చొప్పున ఇస్తున్న పింఛన్లను 3000 రూపాయలు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఇప్పటివరకు 2500 రూపాయలు ఇస్తుండగా, తాజాగా రూ. 3500 చేస్తూ ప్రకటించారు.
జన్మభూమిలో చుక్కెదురు..
జనవరి 2 నుంచి నగరంలో నిర్వహించిన జన్మభూమి సభల్లో సామాజిక భద్రత పించన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి చుక్కెదురైంది. అధికార పార్టీకి చెందిన డివిజన్ అధ్యక్షుల కనుసన్నల్లో పింఛన్ల ప్రక్రియ చేపట్టారు. ఆ సమయంలో తమ డివిజన్ పరిధిలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో తమ పార్టీకి అనుకూలంగా లేనివాటిని పక్కన పెట్టేశారనేది జగమెరిగిన సత్యం. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా ఉన్నవారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే నిర్ధాక్షిణ్యంగా వాటిని పక్కన పెట్టేయడంతో అనేకమంది అర్హులైనవారు పింఛన్లను పొందలేకపోయారు. తెలుగుదేశం పార్టీ డివిజన్ల అధ్యక్షులు మొదలుకొని ఒంగోలు శాసనసభ్యుడు వరకు జన్మభూమిలో అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేశామంటూ ప్రకటించుకుంటున్నారు. అయితే వాటిలో ప్రతిపక్ష పార్టీకి చెందిన వాటిని పక్కన పెట్టేశారన్నది బహిరంగ రహస్యమే.
కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
సామాజిక భద్రత పింఛన్లను పదిరెట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతోపాటు ఫిబ్రవరి ఒకటవ తేదీ శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పండుగ వాతావరణంలో వాటిని లబ్ధిదారులకు అందించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒంగోలు నగర పరిధిలో పింఛన్లకు అర్హులుగా ఉండి, జాబితాలో పేర్లు లేనివారు వాటికోసం పేర్లు నమోదు చేసుకునేందుకు నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చినవారికి అక్కడ భంగపాటు ఎదురవుతోంది. అందుకు కారణం పింఛన్ల నమోదుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రభుత్వం క్లోజ్ చేయడమే. ఎన్నికల సమయంలో పెంచిన పించన్లు ఆసరాగా ఉంటాయన్న ఉద్దేశ్యంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులు నగర పాలక సంస్థ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. పింఛన్ల నమోదుకు సంబంధించిన వెబ్ సైట్ టెంపరరీ అన్ అవైలబుల్ అని వస్తుండటంతో కార్యాలయ సిబ్బంది వారికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది నుండి నామమాత్రంగా దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే ఆ వెబ్‌సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో, ఎప్పుడు పదిరెట్లు పింఛన్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నవారు వాటిని అందుకుంటారో చంద్రబాబుకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment