మండలంలోని పోలిశెట్టిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో టైఫాయిడ్, వైరల్, డెంగీ జ్వరాలతో ప్రజలు మంచనా పడుతున్నా పట్టించు కునేవారే కరువయ్యారు
♦ పోలిశెట్టిపాడులో ఇంటికొకరికి టైఫాయిడ్
♦ పట్టించుకోని వైద్య సిబ్బంది
♦ ప్రయివేటు ఆస్పత్రులకు పరుగులు
పోలిశెట్టిపాడు (ఎ. కొండూరు) : మండలంలోని పోలిశెట్టిపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో టైఫాయిడ్, వైరల్, డెంగీ జ్వరాలతో ప్రజలు మంచనా పడుతున్నా పట్టించు కునేవారే కరువయ్యారు. ఎస్సీ కాలనీలో సుమారు 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో బాధపడుతుండగా ఆరోగ్య వైద్య సిబ్బంది పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం ఒక్కరోజే జ్వరాలబారిన పడిన వారు 20 మంది ప్రయివేటు ఆస్పత్రికి వెళ్లి చేయించుకుంటున్నామని వాపోయారు.
స్థానికులు చిట్టెమ్మ, నిర్మల, కనకరత్నంలతో పాటు సుమారు 40 మందికి వైరల్, టైఫాయిడ్‌లు సోకగా, బాబొల్లెపోగు కుమారి, పవన్, ప్రియాంక, బోస్‌లకు డెంగీ జ్వరాలు వచ్చిన ట్లు వైద్యులు నిర్ధారించారని రోగులు తెలి పారు. వీరు చినఅవుటపల్లిలోని ఆస్పత్రిలో వైద్యం చే యించుకొని ప్రస్తుతం జ్వరాలు తగ్గి మందులు వాడుతున్నారు. ఇద్దరు మాత్రం ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నట్లు స్థానికులు వివరించారు. సాధారణ జ్వరంతో మొదలై డెంగీ జ్వరాలు వస్తున్నాయని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
డెంగీ జ్వరాలో కాదో నిర్ధారిస్తాం
పోలిశెట్టిపాడులో జ్వరాలున్న మాట వాస్తవమే. రక్త పరీక్షలు చేయించి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పంపించి రిపోర్ట్ వచ్చిన తరువాత డెంగీ జ్వరాలు ఉన్నాయో లేదో నిర్ధారిస్తాం. హరిజనవాడలో నీరు నిలువ ఉన్న చోట దోమల మందు కూడా పిచికారీ చేయిస్తున్నాం. వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు వైద్యం సేవలు అందజేస్తాము.
- డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎ.కొండూరు పీహెచ్‌సీ వైద్యాధికారి
మందులు వాడుతున్నా
సాధారణ జ్వరంతో మొదలై డెంగీ జ్వరం వచ్చింది. చినఆవుటుపల్లిలో వైద్య పరీక్షలు చేయించుకోవటంతో జ్వరం తగ్గి ప్రస్తుతం మందులు వాడుతున్నా.
-బొల్లెపోగు కుమారి