మార్చురీ వద్ద ఆందోళన చేస్తున్న మహిళా సంఘాల సభ్యులు
విశాఖపట్నం, డాబాగార్డెన్స్ / పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): బీటెక్ విద్యార్థిని జ్యోత్స్నది ముమ్మాటికీ హత్యేనని మహిళ చేతన కార్యదర్శి కె.పద్మ ఆరోపించారు. నగరంలోని మల్కాపురం ప్రాంతానికి చెందిన జ్యోత్స్న(20) అనుమానాస్పద మృతిపై మహిళా సంఘాలు మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ విద్యార్థిని మృతిపై హత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓ అమ్మాయి అనుమానస్పదంగా మృతి చెందితే దర్యాప్తు చేపట్టకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించే ప్రయత్నం పోలీసులు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు.
ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఫ్యాకల్టీ రూమ్‌లో విద్యార్థిని మృతి చెందిందంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలపాలన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.ఎన్.మాధవి, ఆర్.విమల మాట్లాడుతూ నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో మహిళా సంఘాల ప్రతినిధులు, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment