జవహర్‌నగర్, న్యూస్‌లైన్: నగరానికి సమీపంలో ఉన్నా జవహర్‌నగర్ ప్రజలు దుర్భరజీవితాలను గడుపుతున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. రాంకీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న డంపింగ్‌యార్డ్ రీసైక్లింగ్ ప్లాంటును సోమవారం ఆయన సందర్శించారు. ఫౌండేషన్ ప్రతినిధులతో మాట్లాడి రీసైక్లింగ్‌తో కలిగే ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. జనావాసాల మధ్య డంపింగ్‌యార్డ్‌ను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని అన్నారు. ఇక్కడి డంపింగ్‌యార్డ్‌తో చుట్టుపక్కల 20గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
భూగర్భజలాలు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఇక్కడ నివసించే వారంతా రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేదలని, వీరందరికీ సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జనావాసాల మధ్య నుంచి డంపింగ్‌యార్డ్‌ను ఎత్తేసేవరకు ప్రజలు పోరాటం చేయాలని, దానికి తమ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ విజయేందర్, టీఆర్‌ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరి రాజశేఖర్, డీఎస్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు బి.అనంతలక్ష్మి, టీఆర్‌ఎస్ జవహర్‌నగర్ అధ్యక్షుడు గండి రాంచందర్, నాయకులు జిట్ట శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌యాదవ్, మహేష్, కృష్ణ, సుబ్రహ్మణ్యం, ఆంజనేయులు యాదవ్, చాకలి నాగేష్ పాల్గొన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
Published Tue, Oct 22 2013 1:53 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM
Advertisement
Advertisement