
అపర భగీరథుడు వైఎస్
జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాల ఫలాలు... నేడు అన్నదాతల ముంగిట చేరుతున్నాయి. నీరందక బీళ్లుగా మారిన ఆయకట్టు చివరి భూముల్లో ఆ మహానేత వరప్రసాదం ‘ఎత్తిపోతల’తో నేడు సిరులు కురిపించే రెండు పంటలు పండుతూ అన్నదాతలను ఆదుకుంటున్నాయి.
వెంకటాపురం(పెనుగంచిప్రోలు), న్యూస్‌లైన్ : మండలంలోని వెంకటాపురం గ్రామం వద్ద మునేటిపై జలయజ్ఞ రూపకర్త, వైఎస్ ఆశీస్పులతో అప్పటి ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కృషితో రూ.2.30 కోట్లతో, కె.పొన్నవరం వద్ద రూ.30 లక్షలతో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోతున్న పొలాలకు ఈ ఎత్తిపోతల పథకాలు వరంగా మారాయి.
శనగపాడు మేజర్-1 సాగర్ కాలువ కింద ఉండే చివరి భూములకు సాగునీరు రాక, వర్షాలు పడక రైతులు అనేక ఇబ్బందులకు గురై విసుగుచెంది సుబాబుల్ తదితర పంటలపై దృష్టి సారించారు. ఈ తరుణంలో రైతులకు శాశ్వత లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో వైఎస్ ఆశీస్సులతో ఉదయభాను చేసిన కృషి నేడు కొళ్లికూళ్ల గ్రామంలో 300 ఎకరాలు, వెంకటాపురంలో 465 ఎకరాలు, వెంగనాయకునిపాలెంలో 100 ఎకరాలు ఇలా... మొత్తం 865 ఎకరాలకు సంవృద్ధిగా సాగునీరందుతోంది. మునేరు నుంచి శనగపాడు మేజర్-1కు అండర్‌గ్రౌండ్ పైపులైన్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడ నుంచి రైతులు తమ పొలాలకు నీటిని వాడుకుంటున్నారు.
ఎస్సీల కోసం ప్రత్యేక ఎత్తిపోతల పథకం......
మండలంలోని వెంకటాపురం శివారు గ్రామంలోని కె.పొన్నవరం గ్రామంలో నివశిస్తున్న కేవలం 400 మంది ఎస్సీల కోసం రూ.30 లక్షలతో ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ హయాంలో నిర్మిం చారు. ఎస్సీలకు ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 45 ఎకరాల భూములకు సాగునీరందించేందుకు దీనిని నిర్మించారు.
కళకళలాడుతున్న పొలాలు.......
వర్షాలు లేక, సాగర్ నీరు రాక మండల పరిధిలోని పొలాలన్నీ నెర్రెలు వచ్చి ఎండిపోతుంటే వెంకటాపురం, కె.పొన్నవరం ఎత్తిపోతల పథకాల కింద ఉన్న పొలాలు మాత్రం కళకళలాడుతున్నాయి. మండుతున్న ఎండల్లోనూ మొక్కజొన్నకు నీరు పెట్టుకుంటున్నామని రైతులు ఆనందంతో చెబుతున్నారు.