నీళ్లే లేవు-విమానమేల? | Peoples migrating in KUPPAM | Sakshi
Sakshi News home page

నీళ్లే లేవు-విమానమేల?

Published Mon, Feb 2 2015 5:44 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM

నీళ్లే లేవు-విమానమేల? - Sakshi

నీళ్లే లేవు-విమానమేల?

* బీళ్లుగా మారిన పంట పొలాలు
* కుప్పంలో పనుల్లేక వలసపోతున్న జనం
* ఎయిర్‌పోర్ట్ ఏర్పాట్లలో అధికారులు బిజీ
* సర్వేల కోసం నిధులు ఖర్చుపెడుతున్న వైనం
కుప్పం: సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. సమస్య పరిష్కరించి వారికి అండగా నిలవాల్సిన సీఎం చంద్రబాబునాయుడు, అధికార యంత్రాంగం విమానాశ్రయ ఏర్పాటు పనుల్లో నిమగ్నం కావడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే వర్షాలు లేక పనులు దొరక్క వేలాది కుటుంబాలు వలసబాట పట్టాయి. పల్లెలు ఖాళీ అవుతున్నాయి. గుక్కెడు నీళ్లిచ్చి, పనులు కల్పించి బతుకుదారి చూపుతారనే ఆశతో కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్నా ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం కనిపించడం లేదు.
 
సర్వేల కోసం నిధుల మంజూరు

కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో 1,200 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మించాలని గతంలో అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఆ స్థలం సర్వే చేసేందుకు రూ.14 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రామకుప్పం మండలం అమ్మేరుపేట, కీలకపాడు గ్రామాలకు సంబంధించిన స్థలాలను ఎంపిక చేశారు.
 
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు వుండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అధికారుల రికార్డుల మేరకు 210 గ్రావూల్లో నీటిసవుస్య తీవ్రంగా ఉండడంతో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. నాలుగేళ్లుగా వర్షాలు పడకపోవడంతో కుప్పం కరువు కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గంలోని 570 చెరువులు పూర్తిగా ఎండిపోయూయి. కుప్పంలో 2.55 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. ఇందులో లక్షా 21 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగునీరు లేక 80 శాతం భూములు బీళ్లుగా మారాయి. ప్రస్తుతం కుప్పం ప్రాంతంలో నీళ్లు కావాలంటే 1250-1500 అడుగుల లోతు వరకు బోరు వేయాల్సిందే. కూలి పనుల కోసం నిత్యం కుప్పం నుంచి బెంగళూరుకు 18 వేల వుంది రాకపోకలు సాగిస్తున్నట్లు రైల్వే లెక్కలు చెబుతున్నాయి. ఇటువంటి కరువు పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో వివూనాశ్రయూలు నిర్మించే పనిలో పడింది.
 
రెండు గ్రామాలు ఖాళీ
విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన స్థలం వల్ల రెండు గ్రావూల ప్రజల జీవితాలు కష్టాల్లో పడనున్నాయి. 30 ఏళ్ల క్రితం బడుగు, బలహీన వర్గాల కోసం అప్పటి ప్రభుత్వం భూములు ఇచ్చింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటుతో భూములను స్వాధీనం చేసుకోనుంది.
 
విమానాశ్రయం అవసరమా?
కుప్పం ప్రాంతంలో పండుతున్న పంటలను ఎగుమతి చేసేందుకు డెమో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు గతంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం కుప్పం లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతులంతా వ్యవసాయుం వదలి పనుల కోసం పట్టణాలకు తరలి వెళుతున్నారు. వ్యవసాయు బోర్లు ఎండిపోయాయి.  నీటి సౌకర్యంపై దృష్టి పెట్టకుండా విమానాశ్రయం అవసరమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement