
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. రాజధాని అమరావతిలో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ. 84.84, డీజిల్ రూ. 77.64గా నమోదైంది. గతమూడు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించని చమురు మార్కెటింగ్ సంస్థలు ఇప్పుడు రూపాయి పతనం పేరుతో ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. గత మే నెలలో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 80.42 డాలర్లకు చేరుకున్న తర్వాత నెల రోజుల్లో 70.55 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు 77.42 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
అయితే మే 29న అమరావతిలో లీటరు పెట్రోలు రూ.84.66, డీజిల్ రూ.76.63గా నమోదు కాగా శుక్రవారం ఈ రికార్డు చెరిగిపోయింది. గత ఏడాది కాలంలో డీజిల్ ధరలు 21 శాతం, పెట్రోల్ ధరలు 12 శాతం పెరిగాయి. సరిగ్గా ఏడాది క్రితం రూ. 75.58గా ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 9.26 పెరిగి రూ. 84.84కి చేరింది. ఇదే సమయంలో డీజిల్ ధర రూ 13.27 పెరిగి రూ. 64.37 నుంచి రూ. 77.64కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు తగ్గించకుండా ప్రభుత్వ సహకారంతో ఆ ప్రయోజనాన్ని వారి ఖాతాల్లోనే వేసుకొని, ఇప్పుడు డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడంతో ధరలు పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదనపు పన్నులు మాత్రం తగ్గించరు
పెరుగుతున్న చమురు ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నా ప్రభుత్వాలు కనికరం చూపించడం లేదు. నాలుగేళ్ల క్రితం ధరలు తగ్గినప్పుడు ఆదాయం పెంచుకోవడానికి విధించిన అదనపు పన్నులను ఇప్పుడు రికార్డు స్థాయి ధరల సమయంలోనూ కొనసాగించడం ఎంత వరకు సమంజసమంటూ ప్రజలు నిలదీస్తున్నారు. నాలుగేళ్ల క్రితం లీటరు పెట్రోల్ ధర రూ. 60 సమీంపంలో ఉన్నప్పుడు లీటరుకు రూ. 4 విధించిన అదనపు వ్యాట్‌ను కొనసాగిస్తూ ఖజానా నింపుకోవడానికే చూస్తున్నారు కానీ, మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ సామాన్యులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్ద తేడా లేదంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే చెబుతుండటంపై వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే లీటరు పెట్రోలు గరిష్టంగా రూ. 7.5 వరకు, డీజిల్ రూ.5 వరకు అధికంగా ఉన్న సంగతి ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment