పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం మండలంలో పర్యటించారు. ఆయన హఠాత్తుగా జిల్లా పర్యటనకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశం కాగా.. ఓటుకు నోటు కేసునుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆకస్మిక పర్యటనకు వచ్చారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పోలవరం మండలం పట్టిసీమ వద్ద నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన చంద్రబాబు పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులను మాత్రం కేవలం ఏరియల్ సర్వే ద్వారా చూసి వెళ్లారు. ఓటుకు నోటు కేసు వివాదంలో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు హఠాత్తుగా ఇక్కడకు ఎందుకొచ్చారు.. పర్యటన మధ్యలో పోలవరం స్టేట్‌బ్యాంక్ వద్ద సుమారు పావుగంటసేపు కాన్వాయ్‌ని నిలిపివేసి ఫోన్‌లో ఎవరితో మంతనాలు సాగించారనే దానిపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయి.
పట్టిసీమ పనులు చూశారు.. పరిహారం మాట మరిచారు
పట్టిసీమ హెడ్‌వర్క్స్, పైప్‌లైన్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తిపోతల పథకానికి భూములిచ్చిన రైతులతో మాట్లాడలేదు. కనీసం ఆ రైతులకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. ఎత్తిపోతల పథకం హెడ్‌వర్క్స్ వద్ద మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను పరిశీలించిన సీఎం వాటికి సంబంధించిన వివరాలను మెగా ఇంజినీరింగ్ సంస్థ డెరైక్టర్ సీఎస్ సుబ్బయ్య, ఎస్‌ఈ ఈఎస్ రమేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఫొటో ఎగ్జిబిషన్, మ్యాప్‌లను పరిశీలించారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో ఎత్తిపోతల పథకం పోలవరం కుడి కాలువలో కలిసే ప్రాంతానికి వెళ్లిన సీఎం పైప్‌లైన్ నిర్మాణం, కాంక్రీట్ పనులను పరిశీలించారు.
అవసరమైన పైప్‌లు సిద్ధంగా ఉన్నాయా.. పనులు పూర్తి చేయడంలో ఉన్న ఇబ్బందులేమిటనే విషయాలను కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఎత్తిపోతల పథకం పనుల తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు సీఎం సూచించారు. ఎత్తిపోతల పథకం పనులను దాదాపు గంటపాటు ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన సీఎం దాదాపు 2.45 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 12.45 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అప్పటివరకు ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయకులు ఆయన కోసం వేచివున్నారు. హెలిప్యాడ్ కాన్వాయ్‌లో నేరుగా హెడ్‌వర్క్స్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో పైప్‌లైన్ పనులు జరగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఖరారు కావడంతో పలు శాఖల అధికారులు రాత్రంతా మేలుకొని ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ పి.శ్రీమన్నారాయణ రాత్రిరాత్రికి ఏలూరు నుంచి సిబ్బందిని రప్పించి హెలిప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయించారు. సీఎం పర్యటనలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, ఎంపీ తోట సీతారామలక్ష్మి, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కె.భాస్కర్, డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఎమ్మెల్యేలు కేఎస్ జవహర్, గన్ని వీరాంజనేయులు, పులపర్తి అంజిబాబు, బడేటి బుజ్జి, కలపూడి శివ, ముప్పిడి వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకటరమణ, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఐటీడీఏ పీవో ఆర్‌వీ సూర్యనారాయణ, భూసేకరణ కలెక్టర్ డి.సుదర్శన్, పార్టీ నాయకులు బొరగం శ్రీనివాస్, కుంచె దొరబాబు పాల్గొన్నారు.
ఎందుకొచ్చినట్టో!
Published Fri, Jun 19 2015 2:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM
Advertisement
Advertisement