సాక్షి, అమరావతి: గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టగానే పోలవరం పనులను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) రాష్ట్ర జలవనరుల శాఖను ఆదేశించింది. మే నాటికి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు పూర్తి చేయాలని, 41.5 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని నిర్దేశించింది. పీపీఏ సీఈవో ఆర్కే జైన్ అధ్యక్షతన సంస్థ సర్వ సభ్య సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రస్తుత సీజన్‌లో పూర్తి చేయాల్సిన పనులు, నిపుణుల కమిటీ నివేదిక, నిర్వాసితులకు పునరావాసం కల్పన తదితర అంశాలపై ఇందులో సమగ్రంగా చర్చించారు.
పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ‘రివర్స్ టెండరింగ్’ వల్ల రూ.782.8 కోట్లు ఆదా అయిందని, 65వ ప్యాకేజీ పనులకు రివర్స్ టెండరింగ్ వల్ల రూ.58.53 కోట్లు ఆదా అయిందని జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ పీపీఏకి వివరించారు. పోలవరం పనులకు సంబంధించి హైకోర్టు తీర్పు అతి త్వరలోనే వస్తుందని, కోర్టు ఆదేశాల మేరకు కొత్త కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పెండింగ్ డిజైన్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), డీడీఆర్‌పీ(డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్)తో చర్చించి ఆమోదం పొందాలని పీపీఏ పేర్కొంది. పోలవరం పనుల్లో అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంలో కేంద్ర జల్ శక్తి శాఖ సూచించే అధికారిని సభ్యుడిగా చేర్చాలని పీపీఏ సీఈవో సూచించారు.
పర్యావరణానికి ఎలాంటి హాని లేదు..
పోలవరం పనుల వల్ల పర్యావరణానికి హాని వాటిల్లుతోందంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)లో దాఖలైన వ్యాజ్యంపై సమావేశంలో ఆర్కే జైన్ ప్రస్తావించారు. దీనిపై ఆదిత్యనాథ్‌దాస్ స్పందిస్తూ పోలవరం హెడ్ వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు చేయడానికి తవ్విన మట్టి నిల్వ కోసమే భూసేకరణ చేశామని తెలిపారు. ఇదే మట్టిని ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌లో వినియోగిస్తామని, దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని ఎన్జీటీకి నివేదించామన్నారు.
పోలవరాన్ని 2021 నాటికి పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించారని, ఆ మేరకు పనులు జరిగేలా ప్రణాళిక సిద్దం చేశామన్నారు. ఇప్పటికే చేసిన పనులకు రూ.5,103 కోట్లు విడుదల చేయాలని కోరారు. సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లను ఆమోదించి ఆ మేరకు నిధులు విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నిధుల కొరత లేకుండా చూస్తే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించగలుగుతామని స్పష్టం చేశారు. సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ ఆర్థిక సలహాదారు జగ్‌మోహన్ గుప్తా, పీపీఏ సభ్య కార్యదర్శి పాండే, సీఈ ఏకే ప్రధాన్, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment