సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల ఆమోద ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. కేంద్ర జలసంఘం టీఏసీ (సాంకేతిక సలహా కమిటీ) రూ.55,548.87 కోట్లతో ఖరారు చేసిన పోలవరం సవరణ ప్రతిపాదనలను ఆర్‌ఈసీ (రివైజ్డ్ ఎస్టిమేట్స్ కమిటీ) పరిశీలించింది. ఆర్‌ఈసీ ఛైర్మన్ జగన్‌మోహన్ గుప్తా రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలోని అధికారుల బృందంతో పలుమార్లు సమావేశమై పనుల పరిమాణం, భూసేకరణ, పునరావాస కల్పన వ్యయంపై సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సూత్రప్రాయంగా ఆమోదించిన ఆర్‌ఈసీ వారం రోజుల్లోగా కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపనున్నట్లు ఆదిత్యనాథ్ దాస్‌కు శుక్రవారం సమాచారం ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిమండలికి ప్రతిపాదనలు పంపుతుంది. ఈ నేపథ్యంలో ఆమోదం పొందడం ఇక లాంఛనమే.
కొత్త చట్టంతో పెరిగిన వ్యయం
2010–11 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లు మాత్రమే. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం వంద శాతం ఖర్చు భరించి శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్రం 2013లో కొత్తగా భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చాక భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయం భారీగా పెరిగింది. తాజా ధరల మేరకు పనుల వ్యయమూ పెరగడంతో కేంద్ర జల్‌శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు 2017–18 ధరల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల సవరించిన ప్రతిపాదనలు పంపింది. దీన్ని పరిశీలించిన సీడబ్ల్యూసీ టీఏసీ రూ.55,548.87 కోట్లకు అంచనాలను సవరిస్తూ ఆమోద ముద్ర వేసింది.
- సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనాల ప్రకారం పోలవరం పనుల వ్యయం రూ.22,380.54 కోట్లు. ఇందులో 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు.
భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.33,168.24 కోట్లు.
- అయితే పోలవరం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో జలవిద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఇవ్వబోమని కేంద్రం మెలిక పెట్టింది. ఆర్‌ఈసీ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేస్తే పోలవరం వ్యయం రూ.51,424.23 కోట్లు అవుతుంది. ఇందులో పనుల వ్యయం రూ.18,255.99 కోట్లు.
- పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,966.13 కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.34,458.10 కోట్లు అవసరం.
- పోలవరం కోసం 2014 ఏప్రిల్ 1కి ముందు చేసిన వ్యయం రూ.5,135.87 కోట్లు కాగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక చేసిన వ్యయం రూ.11,830.26 కోట్లు. ఇప్పటిదాకా రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. ఇటీవల రూ.1,850 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో ఇంకా రూ.3,253 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment