
మహిళలను దౌర్జన్యంగా వ్యాన్‌లో ఎక్కిస్తున్న పోలీసులు
చోడవరం: తమ ఉపాధిని తీసేయొద్దంటూ ఆందోళనకు దిగిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహక మహిళలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ధాక్షణ్యంగా వ్యవహరించింది. మహిళలని కూడా చూడకుండా పోలీసులు పిడిగుద్దులు గుద్దుతూ, దౌర్జన్యంగా వారిని ఈడ్చుకెళ్లి అరెస్టులు చేశారు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కమిటీలను కాదని ఈ నెల 24 నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరఫరా చేసే కాంట్రాక్టును ‘నవ ప్రయాస్’ అనే ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం ఆప్పగించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భోజన పథకం నిర్వాహకులు చోడవరం సమీపంలో ఉన్న నవప్రయాస్ సంస్థ వంటశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు.
మహిళను బలవంతంగా ఈడ్చుకెళ్తున్న పోలీసులు
సీఎం చంద్రబాబు ప్రైవేటు సంస్థల వద్ద ముడుపులు తీసుకుని తమ జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో అనకాపల్లి డీఎస్పీ, చోడవరం,అనకాపల్లి సీఐలు, ఎస్‌ఐలు పెద్దసంఖ్యలో పోలీసు బలగాలతో వచ్చి ధర్నా చేస్తున్న మహిళలను భయాందోళనలకు గురిచేశారు. ఎదురుతిరిగిన మహిళలపై విచక్షణారహితంగా ప్రవర్తించారు. మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యంగా పిడిగుద్దులతో ఈడ్చుకెళ్లి వ్యాన్లు ఎక్కించారు. అనంతరం చోడవరం పరిసర ప్రాంతాల్లోని వివిధ పోలీసు స్టేషన్లకు వీరిని తరలించారు. ఈ సందర్భంగా పలువురు స్పృహ కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని చోడవరం ఆస్పత్రికి తరలించారు. అరెస్టు అయిన వారిలో 100 మంది మహిళలు ఉన్నారు. సాయంత్రం కొందర్ని విడుదల చేసిన పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.