సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు అందరూ స్థానిక సంస్థల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అందులోనూ మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనంటూ ఉవ్విళ్లూరుతున్నారు. అంతకంటే ముందు అసలు ఏ మునిసిపాలిటీ ఏ సామాజికవర్గానికి రిజర్వు అవుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాలో ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు ఉండగా.. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలకు న్యాయ చిక్కులు వచ్చిపడడంతో దశాబ్దకాలం పైగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన చోట్ల ఎన్నికలకు ఎలాంటి అవాంతరం రాలేదు. అయితే 2014లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్లు, మేయర్ రిజర్వేషన్లు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు జరిగింది. రాష్ట్ర విభజన తరువాత కూడా పాత రిజర్వేషన్ల ప్రకారమే సామాజిక వర్గాల ఆధారంగా చైర్మన్, మేయర్ స్థానాలు రిజర్వు అయ్యాయి.
చిత్తూరు అర్బన్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలను ఓ యూనిట్‌గా, 16 కార్పొరేషన్లను ఓ యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఫలితంగా జిల్లాలో సైతం పలు స్థానాల రిజర్వేషన్లు మారే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో రిజర్వేషన్లకు 50 శాతానికి కుదించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలోని స్థానిక సంస్థల రాజకీయాల్లో ప్రస్తుతం 78 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. మిగిలిన 22 శాతం మాత్రం ఓపెన్ కేటగిరిలో ఉంచారు. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలకు వెళ్లాలంటే ఇప్పుడున్న 78 శాతాన్ని 50 శాతానికికుదించాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానంచేసి ఆర్డినెన్స్ జారీచేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం, మైనారిటీ, మహిళలకు కేటాయించిన రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేసి.. మిగిలిన దాన్ని ఓపెన్ కేటగిరికి ఉంచనున్నారు.
పూర్తయిన గణన..
ప్రస్తుతం జిల్లాలోని మునిసిపాలిటీలతో పాటు చిత్తూరు కార్పొరేషన్‌లో ఉన్న పాలకవర్గానికి జూలై 2వ తేదీతో గడువు ముగుస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లాలోని 269 వార్డుల్లో ఓటర్ల జాబితాను సైతం ప్రచురించారు. దానితరువాత రాష్ట్ర మున్సిపల్ పరిపాలన విభాగం నుంచి వచ్చిన ఆదేశాలతో మునిసిపాలిటీల్లో వార్డుల్లో ఉన్న ఓటర్లను సామాజిక వర్గాల ఆధారంగా గుర్తించారు. ఈనెల 4వ తేదీన వార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల జాబితాను జిల్లా వ్యాప్తంగా ప్రచురిస్తారు. అనంతరం రెండు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించి ఈనెల 17న తుదిగా కులాల వారీగా ఓటర్ల జాబితా వార్డుల్లో ప్రచురించి, 18వ తేదీ జాబితాను కమిషనర్లు.. రాష్ట్ర మునిసిపల్ శాఖకు అందచేస్తారు.
తగ్గనున్న వార్డుల రిజర్వేషన్
చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లతో పాటు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, నగరి, పుత్తూరు, శ్రీకాళహస్తి మునిసిపాలిటీల్లో ప్రస్తుతం 269 వార్డులున్నాయి. వీటిల్లో తిరుపతి మినహా మిగిలిన చోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 2014లో వార్డుల రిజర్వేషన్ జరిగింది. వీటిలో 78 శాతం రిజర్వేషన్ ఉంది. అయితే ప్రస్తుతం రిజర్వేషన్‌ను 50 శాతానికి కుదించాల్సి ఉండడంతో సగం వార్డులు ఓపెన్ కేటగిరికీ ఉంచుతారు. వార్డుల రిజర్వేషన్‌లో మాత్రం తప్పనిసరిగా ఈసారి రొటేషన్ పద్ధతిలో గతంలో వచ్చిన రిజర్వేషన్ కేటగిరీలను మార్చనున్నారు. చైర్మన్, మేయర్ స్థానాలకు తొలిసారిగా రాష్ట్ర యూనిట్ తీసుకుంటున్న వైనంలో జిల్లాలో ఇప్పుడున్న రిజర్వు స్థానాల్లో కొన్ని అదే వర్గాలకు కేటాయించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరో మూడు నెలల్లో మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment