నువ్వా–నేనా! | political showing strength in mlc election | Sakshi
Sakshi News home page

నువ్వా–నేనా!

Published Thu, Mar 9 2017 10:54 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

నువ్వా–నేనా! - Sakshi

నువ్వా–నేనా!

► ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలదే హవా
► పట్టభద్రుల్లో ముందంజలో వెన్నపూస గోపాల్‌రెడ్డి
► ద్వితీయ, తృతీయస్థానాల్లో గేయానంద్, కేజేరెడ్డి
► నేడే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌
► పట్టభద్రులకు 352, ఉపాధ్యాయులకు 172 పోలింగ్‌ కేంద్రాలు


సాక్షి ప్రతినిధి, కడప: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పట్టభద్రులకు 352, ఉపా«ధ్యాయులకు 172 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. అభ్యర్థుల మధ్య నువ్వా–నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ఈ ప్రక్రియలో రాజకీయపార్టీలే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వంపై వ్యతిరేకత అటు టీచర్లు, ఇటు గ్రాడ్యుయేట్స్‌లో బాగా కనిపిస్తోంది. అదే ఈ ఎన్నికల్లో ఎక్కువ ప్రభావం చూపనుందని విశ్లేషకుల అంచనా.

524 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలో 524 పోలింగ్‌ బూత్‌లు(అనంతపురం, కర్నూల్, వైఎస్సార్‌ జిల్లాలు కలిపి) ఏర్పాటుచేశారు. అందులో పట్టభద్రులకు 352 పోలింగ్‌ బూత్‌లు, ఉపాధ్యాయులకు 172 పోలింగ్‌ బూత్‌లు కేటాయించారు. వాటి పరిధిలో 2,49,582 మంది పట్టభద్రులు, 20,515 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఆయా జిల్లాల ఓటర్లు వారి పోలింగ్‌బూత్‌లోనే ఓటును వినియోగించుకునే ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గతంలో పట్టభద్రుల పోలింగ్‌ గణనీయంగా పడిపోయింది. ఈమారు ఓటుహక్కు వినియోగించుకోవాల్సిందిగా అటు అధికారులు ఇటు రాజకీయ యకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. దాంతో గతం కంటే మెరుగ్గా పోలింగ్‌ శాతం నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మేధావుల ఓటు తీర్పును సైతం ప్రభావితం చేసేందుకు కొందరు అభ్యర్థులు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. ఈక్రమంలో టీడీపీ బలపర్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య వర్గీయులు ఓటర్లకు నగదు పంపిణీ చేయబోయి పట్టుబడ్డారు. అనంతపురం సీపీఐ కార్యకర్తలు పుల్లయ్య వర్గీయులను పోలీసులకు పట్టించారు.

ముందంజలో వెన్నపూస గోపాల్‌రెడ్డి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి ముందంజలో ఉన్నారని విశ్లేషకులు అంచనా. ప్రభుత్వ వ్యతిరేకత, ఎన్జీఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడుగా పనిచేసిన అనుభవం గోపాల్‌రెడ్డికి కలిసొచ్చే అంశాలుగా పలువురు వివరిస్తున్నారు. మూడు జిల్లాలో వ్యక్తిగతంగా ఎన్జీఓలతో ప్రత్యక్ష çసంబంధాలు కల్గి ఉండడం, వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం ప్రభుత్వంపై మేధావులు ఓటుతో బుద్ధిచెప్పాలని ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం గోపాల్‌రెడ్డికి అదనపు ప్రయోజనంగా మారిందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అధికారపార్టీ అభ్యర్థి కేజేరెడ్డిపై ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇతర వర్గాల మద్దతు లభించే అవకాశాలు లేవని పరిశీలకులు వివరిస్తున్నారు. ఇదివరకే ఎమ్మెల్సీగా పనిచేసినా డాక్టర్‌ గేయానంద్‌కు ఈమారు ప్రతికూల పరిస్థితులు కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా రాయలసీమ ఉద్యమ ప్రభావం ప్రతిబంధకంగా మారనున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలో రాయలసీమ పరిరక్షణ సమితి, రాయలసీమ రాష్ట్ర సాధన సమితి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఇలా రాయలసీమకు చెందిన దాదాపు 20 సంఘాలు గేయానంద్‌కు వ్యతిరేకంగా తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డిని బరిలో దింపాయి. మునుపు రాయలసీమకు చెందిన ఆయా సంఘాలు, రాజకీయపార్టీలు గేయానంద్‌ను బలపర్చేవి. అవన్నీ ప్రస్తుతం వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఈదశలో గేయానంద్‌ ఎమ్మెల్సీ రేసులో వెనుకంజలో ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ప్రాధాన్యతపై గేయానంద్‌ ఆశలు పెంచుకున్నారు. ప్రజాసంఘాల అభ్యర్థులు అనుకూలమైన ఓట్లు తొలి ప్రాధాన్యత ఆయా అభ్యర్థులకు లభించినా, ద్వితీయ ప్రాధాన్యత ఓటు వస్తుందనే ఆశలో ఉన్నారు. కాగా ఈమారు మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయాలని తర్వాత ప్రాధాన్యత ఓటు అభ్యర్థులకు ఇవ్వరాదని రాజకీయపార్టీలు స్పష్టం ప్రచారం చేశాయి. ఆయా పార్టీల శ్రేణుల నుంచి ద్వితీయ ప్రాధాన్యత ఓటు లభించే అవకాశం గతంలో కంటే తక్కువగా ఉండవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇత్యాది కారణాల రీత్యా వెన్నపూస గోపాల్‌రెడ్డి ముందంజలో ఉన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

ఉపాధ్యాయుల్లో బహుముఖ పోటీ: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో బహుముఖ పోటీ అనివార్యమైంది. ప్రధానంగా కత్తి నరసింహారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, బచ్చల పుల్లయ్య, పోచంరెడ్డి సుబ్బారెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల నాటి నుంచి ఆయా వర్గీయులు ఎత్తులకు పైఎత్తు లు వేస్తూ వచ్చారు. పోటీలో ఉంటూనే మనం గెలవకపోయినా ఎదుటోన్ని గెలవనీయవద్దు అన్నట్లుగా కొందరు ప్రచారం చేస్తూ వచ్చారు. మరోవైపు కొందరు ఓటుకు డబ్బులు సైతం పంపిణీకి సన్నద్ధమయ్యారు. టీచర్లను ప్రభావితం చేసేందు కు ఓటు కు రూ.2వేలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు కత్తి నరసింహారెడ్డిని బలపరుస్తున్నా ఓటుకు డబ్బులు పంపిణీ చేయడంలో మరో ఇద్దరు ముందంజలో ఉన్నట్లు సమాచారం. రాజకీయ పార్టీల మద్దతు, ఉద్యమ చరిత్ర, సామాజిక సమీకరణలు నేపథ్యంలో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా రెండవ ప్రాధాన్యత ఓటు అభ్యర్థుల దశను మార్చే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు.

మేధావుల తీర్పు ఇది..: గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ వర్గాలు ఎంపికచేసిన ఎమ్మెల్సీలు రాజకీయాలకతీతంగా చట్టసభల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ముందుంటారని, ప్రభుత్వ నిర్ణయాలపై దిశనిర్దేశం చేస్తారనే ఉన్నతాశయంతో శాసనమండలిలో వారికి స్థానాలను కేటాయించారు. మేధావులు ఓటు తీర్పుతో ఎమ్మెల్సీల ఎంపికకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో పశ్చిమ రాయలసీమలో పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి పోటీ అనివార్యమైంది. ఆమేరకు ప్రభుత్వ యంత్రాంగం పోలింగ్‌కు సర్వసిద్ధం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement