
ఉరవకొండ: నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌లో జరిగిన గందరగోళంపై ఈనెల 3న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి శోభా స్వరూపారాణి చర్యలు చేపట్టారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆర్‌ఓతో పాటు ఏఆర్‌ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ‘సాక్షి’లో వచ్చిన పోస్టల్ మాయాజాలం కథనం పై విచారణ చేపట్టామన్నారు. అయితే ఇందులో విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి ఆంజినేయులు గత నాలుగు నెలల క్రితం మృతి చెందారన్నారు. మృతుడి కుమారుడు వరప్రసాద్ కూడా ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. అయితే అధికారులు కుమారుడికి పోస్టల్ బ్యాలెట్ మంజురు చేయాల్సింది పోయి మృతి చెందిన ఆంజినేయులుకు పోస్టల్ బ్యాలెట్ పంపారని తెలిపారు. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నోడల్ ఆఫీసర్ ఉదయ్‌భాస్కర్‌రాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.
10 మందికి నోటీసులు
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు మంజురు చేసిన పొస్టల్ బ్యాలెట్‌లలో 30 మంది ఉద్యోగులు రెండేసి బ్యాలెట్ పత్రాలు పొందారని తెలిపారు. ఇందులో 20 మంది వెంటనే బ్యాలెట్ పత్రాలు వెనక్కి తీసుకొచ్చి అప్పగించారన్నారు. ఇంకా 10 మంది ఉద్యోగులు మాత్రం బ్యాలెట్ పత్రాలు వారి వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో 10 మంది ఉద్యోగులకు బ్యాలెట్‌లు వెనక్కి ఇవ్వాలంటూ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు.