రైతన్నకు గుండె ‘కోత’!
విజయనగరం మున్సిపాలిటీ : ఖరీఫ్ పనుల్లో నిమగ్నమవుతున్న రైతులు... వర్షాల జాడలేకపోవడంతో పంపుసెట్లపై ఆధారపడవలసిన పరిస్థితి. అయితే ఇందు కు విద్యుత్ తప్పనిసరి. కానీ కోతలు వారి పాలిట శాపాలుగా మారాయి. వ్యవసాయానికి ఏడు గంటలు సరఫరా చేయవలసి ఉండగా జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. కేవలం మూడు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 26,786 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించి అధికారులు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందులో ఎ-గ్రూప్ కనెక్షన్లకు రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు, మళ్లీ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, బి-గ్రూప్ కనెక్షన్లకు రాత్రి ఒంటి గంట నుంచి వేకువజామున 4 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా ఇవ్వాల్సి ఉంటుంది.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలి. ఇదికాకుం డా ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబా బు ఇందుకు అదనంగా మరో రెండు గంటలు కలిపి మొత్తం 9 గంటల పాటు సరఫరా చేస్తామని ప్రకటించారు. అయితే కనీసం మూడు గంటల పాటు కూడా సరఫరా జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 160 ఫీడర్ల ద్వారా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తుండగా అందులో కేవలం 19 ఫీడర్ల పరిధిలో గల కనెక్షన్‌లకు మాత్రమే ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని, మిగిలిన 141 ఫీడర్ల పరిధిలో గల కనెక్షన్‌లకు నాలుగు నుంచి ఐదు గంటల పాటు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
అయితే అధికారులు చెబుతున్న సరఫరా వేళల సమయానికి, క్షేత్రస్థాయి లో అమలు జరుగుతున్న తీరుకు వ్యత్యాసం ఉంటోందని రైతన్నల వాదన. కనీసం మూడు గంటలు కూడా సరఫరా ఉండడం లేదని, ఇచ్చే సరఫరా కూడా ఏ సమయంలో వస్తున్నది తెలియడం లేదని చెబుతున్నారు. వరుణుడి ముఖం చాటేసినప్పటికీ కనీసం కరెంట్ ద్వారానైనా మోటార్ల ద్వారా పొలాలు తడిపి తినటానికి నాలుగు గింజలు పండించుకుందామన్న రైతన్న ఆశలు అడియాశలుగా మారుతున్నా యి. విద్యుత్‌కోతల కారణంగారైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ అధికారులు తమపై కరుణ చూపి కోతలు లేకుండా సరఫర్యా చేయాలని కోరుతున్నారు.
మెరుగైన సరఫరాకు కృషి
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందు కు కృషి చేస్తున్నాం. విద్యుత్ సంక్షోభం నేపథ్యంలో కోత లు విధించవలసి వస్తోంది. నాలుగు నుంచి ఐదు గంటల పాటు సరఫరా చేస్తున్నాం. సరఫరాను మరింత మెరుగుపరచడంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిశ్రమలకు రాత్రి వేళల్లో నిబంధనలు విధించి ఆ విద్యుత్‌ను వ్యవసాయ కనెక్షన్‌లకు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు సంస్థ నిర్ణయించింది. ఆ ప్రక్రియ పూర్తయితే ఆశించిన మేర సరఫరా ఇవ్వగలం.
- సి.శ్రీనివాసమూర్తి, ఎస్‌ఈ