విద్యుత్‌ సిబ్బంది వికృత హాసం..వృక్ష విలాపం! | Power Department Employees Cutting Trees in GVMC | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సిబ్బంది వికృత హాసం..వృక్ష విలాపం!

Published Tue, Feb 18 2020 1:26 PM | Last Updated on Tue, Feb 18 2020 1:26 PM

Power Department Employees Cutting Trees in GVMC - Sakshi

విద్యుత్‌ సిబ్బంది కొమ్మలు నరికివేయడంతో మోడుగా మారిన చెట్టు

హుద్‌హుద్‌ విపత్తు వేళా మేం ఇంతలా బాధపడలేదు. ప్రకృతి విలయ తాండవం చేసిన సమయంలో కూకటి వేళ్లతో సహా నేలకొరిగాం. కొన్నాళ్లకే మళ్లీ సగర్వంగా లేచి నిలబడ్డాం. కానీ.. ఇప్పుడు మమ్మల్ని ఖండ ఖండాలు చేస్తున్న తీరుతో తీవ్రంగా కుంగిపోతున్నాం.వసంత రుతువులో చిగురించాం.. గ్రీష్మంలో చల్లదనాన్ని పంచాం. అదే సమయంలో పచ్చని చెట్లు– ప్రగతికి మెట్లు, హరిత విశాఖ అన్న నినాదాలు వినిపిస్తుంటే.. మాపై మనుషులకు గౌరవం పెరిగిందని సంబర పడ్డాం. లేలేత చిగుళ్లన్నీ ఇప్పుడిప్పుడే ఆకులుగా మారుతున్న తరుణంలో పచ్చదనంతో పరవళ్లు తొక్కుతూ.. పది మందికి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచుదామనుకున్నాం.ఇంతలోనే విద్యుత్‌ తీగలకు అడ్డుతగులుతున్నామన్న సాకుతో.. పెంచిన చేతులతోనే మా అంగాంగాలను తెగ నరుకుతున్నారు. ఆక్సిజన్‌తో పాటు నీడనిస్తున్న మమ్మల్ని మోడుల్లా మార్చేస్తున్నారు. మళ్లీ చిగురించి నిలదొక్కుకుంటున్నాం. ఆ ఆనందాన్నీ ఎంతో కాలం అనుభవించనీయకుండా మళ్లీ మళ్లీ మోడులుగా మార్చేస్తున్నారు. ప్రతి రెండు మూడు నెలలకోసారి విద్యుత్‌ సిబ్బంది వికృత చేష్టలకు బలైపోతున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మేము చేసిన పాపమా..? పర్యావరణాన్ని పరిరక్షించడమే మా పాలిట శాపమా..??..నగరంలో జాతీయ రహదారితో పాటు వివిధ ప్రాంతాల్లో ఏళ్ల వయసున్న వృక్షాల విలాపమిదీ!

సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా నీడనిస్తున్న చెట్లను నరకొద్దని స్థానికులు వారిస్తున్నా విద్యుత్‌ సిబ్బంది మెయింటెనెన్స్‌ పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. హరిత విశాఖను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నా.. తమకేమీ పట్టదన్నట్లుగా ఈపీడీసీఎల్‌ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు నగరంలోని చెట్లను నరికేస్తున్నారు.

జీవీఎంసీ లేఖలు రాసినా...
ఓవైపు పచ్చదనాన్ని పెంచి.. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఈపీడీసీఎల్‌ ఇలా పర్యావరణాన్ని ఛిద్రం చేస్తుండటంపై జీవీఎంసీ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మూడేళ్లుగా ఈపీడీసీఎల్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలితం శూన్యమనే చెప్పాలి. 2017 నుంచి ఈ విషయంలో జీవీఎంసీతో సమన్వయం చేసుకొని పనిచేయాలని అప్పటి కమిషనర్‌ హరినారాయణన్‌ విద్యుత్‌ అధికారులకు పలుమార్లు లేఖలు రాశారు. గత ఏడాది ఆగస్టులో ప్రస్తుత కమిషనర్‌ సృజన సైతం అధికారులకు విజ్ఞప్తి చేశారు. హుద్‌హుద్‌ విలయంతో విశాఖలో పచ్చదనం 23 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందనీ.. ఇప్పుడిప్పుడే దాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నామంటూ అధికారులకు వివరించినా ఫలితం లేకపోయిందని జీవీఎంసీ ఉద్యానవన విభాగం అధికారులు వాపోతున్నారు.

వాల్టా చట్టం ఏం చెబుతోంది..?
పర్యావరణ పరిరక్షణకు 2002లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాల్టా చట్టంపై అదే ప్రభుత్వ సంస్థలు గొడ్డలి వేటు వేస్తున్నాయి. వాల్టా చట్టం సెక్షన్‌–2 ప్రకారం నగరాలు, పట్టణాల్లో స్థానిక సంస్థలు మొక్కలు నాటాలి. ఉన్న వాటిని సంరక్షించాలి. కానీ ఆ సెక్షన్లను కాలరాస్తూ దశాబ్దాలుగా నీడనిస్తూ.. పర్యావరణాన్ని కాపాడుతున్న భారీ వృక్షాలను నరికేస్తున్నారు. విద్యుత్, టెలికాం, రహదారులు – భవనాలు వంటి శాఖలు విధి నిర్వహణ పేరుతో చెట్లు, వాటి కొమ్మలను ఇష్టారాజ్యంగా నరికేయకూడదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరంటూ వాల్టా చట్టంలోని సెక్షన్‌–29 చెబుతోంది. ఒక చెట్టును కొట్టాల్సి వస్తే.. దానికి ప్రత్యామ్నాయంగా రెండు మొక్కలు నాటాల్సి ఉంది. వాటి సంరక్షణకు అవసరమైన ఖర్చును సంబంధిత శాఖలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఎవరికి నచ్చినట్లు వారు పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఇటీవలే జీవీఎంసీ జోన్‌–3 పరిధిలో దుకాణానికి అడ్డంగా ఉందని చెట్టును నరికేయడంతో సదరు షాపును అధికారులు సీజ్‌ చేశారు. కానీ ప్రభుత్వ సంస్థ విషయంలో మాత్రం జీవీఎంసీ ఆ తరహా సాహసం చేయలేకపోతోంది. అయితే గతంలో ఇదే తరహాలో చెట్లను నరికివేయడాన్ని సహించలేకపోయిన జీవీఎంసీ అధికారులు.. నరికేసిన కొమ్మలను ఈపీడీసీఎల్‌ కార్యాలయాల్లోనే పడేశారు. అయినా వారిలో మార్పు రావట్లేదని జోనల్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమన్వయంతో మెయింటెనెన్స్‌ పనులు చేపడితే.. పర్యావరణానికి విఘాతం కలగకుండా నిర్వహించవచ్చని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.

తరచూ ఇదే తంతు..
చెట్లు పెరిగి.. వాటి కొమ్మలు విద్యుత్‌ తీగలను తాకితే ప్రమాదాలు సంభవిస్తాయనే ఉద్దేశంతో ఏటా మూడు నాలుగుసార్లు ఈపీడీసీఎల్‌ అధికారులు మెయింటెనెన్స్‌ పనులు చేపడుతున్నారు. కరెంటు తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను గుర్తించి వాటిని కత్తిరించాలి. వాస్తవంగా అయితే.. కరెంట్‌ తీగలకు 6 నుంచి 10 అడుగుల దిగువ వరకు కొమ్మలను నరికాలి. కానీ నగరంలో మాత్రం నేల నుంచి 3–5 అడుగుల వరకు ఉంచి.. మిగిలిన చెట్టు కొమ్మలన్నింటినీ నరికేస్తున్నారు. దీంతో ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడిన చెట్లన్నీ మోడులవుతున్నాయి.

గుండె తరుక్కుపోతోంది
సీఎం ఆశయాలకు అనుగుణంగా నగరంలో పచ్చదనం పెంపొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ప్రతి మొక్కను ప్రాణంగా పెంచుతున్నాం. అయితే మెయింటెనెన్స్‌ పేరుతో ఆ చెట్లను ఛిద్రం చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. విద్యుత్‌ అధికారులు జీవీఎంసీకి ఈ బాధ్యత అప్పగించాలి. లేదంటే సమన్వయంతో పనిచేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.– దామోదరరావు,ఉద్యానవన విభాగాధిపతి, జీవీఎంసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement