ఎల్లలు దాటుతున్న ‘స్పందన’  | Prakasam District SP Siddhartha Kaushal New Experiment On Spandana Program | Sakshi
Sakshi News home page

ఎల్లలు దాటుతున్న ‘స్పందన’ 

Published Mon, Nov 25 2019 5:07 AM | Last Updated on Mon, Nov 25 2019 5:07 AM

Prakasam District SP Siddhartha Kaushal New Experiment On Spandana Program - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా ‘స్పందన’ నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ (ఫైల్‌)

ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రిక ‘స్పందన’ కార్యక్రమం ఖ్యాతి ఎల్లలు దాటుతోంది. అర్జీలు తీసుకోవడం, అధికారులకు పంపడానికి పరిమితం కాకుండా నిర్ణీత కాల వ్యవధిలో తిరుగు సమాధానం కూడా ఇస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై చర్చ నెలకొంది. దీంతో దీనిని మరింత విస్తృతపరిచేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ నిర్ణయించారు. సుదూర ప్రాంతాల్లో ఉండే జిల్లాకు చెందిన వారికి సైతం ఈ సేవలు అందించాలని.. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉందన్న భావన వారిలో కల్పించాలని సంకల్పించారు.

కార్యక్రమం నిర్వహణ ఇలా..
ప్రతి సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లా ఎస్పీ తన వద్దకు వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడతారు. మ.2.30–4.00 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ పోలీసుస్టేషన్లకు వచ్చిన ప్రజలతో మాట్లాడతారు. ఆన్‌లైన్‌ స్పందన కార్యక్రమానికి సంబంధించి టైమ్‌స్లాట్‌ను నిర్ణయించనున్నారు. విదేశాలలో ఉండేవారు ముందుగా ఎస్పీ కార్యాలయానికి సంబంధించిన ప్రకాశం జిల్లా వాట్సప్‌ నంబర్‌ 9121102266కు లేదా ‘ప్రకాశం పోలీస్‌’ ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు ఒక రిక్వెస్ట్‌ పంపుకోవాలి. దీంతో తమకు ఫలానా సమయంలో కుదురుతుందని పేర్కొంటూ ఆ సమయాన్ని వాట్సప్‌ ద్వారా ఒక లింక్‌ ఇస్తారు. దాని ద్వారా నేరుగా ఎస్పీతో మాట్లాడేందుకు అవకాశం కలుగుతుంది. ఇలా మాట్లాడిన వారికి కూడా ఆన్‌లైన్‌ లేదా వారి బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వెళ్తే స్పందన రశీదును కూడా అందజేస్తారు.  
‘స్పందన’కు విచ్చేసి వెయిటింగ్‌ హాలులో వేచిఉన్న ప్రజానీకం (ఫైల్‌) 

నేటి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా..
సీఎం ఆదేశాలను జిల్లా ఎస్పీ స్ఫూర్తిగా తీసుకున్నారు. ఫిర్యాది, విచారణాధికారి, తాను ఒకే ప్లాట్‌ఫాంలో ఉంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించి ఈనెల 25 నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా స్పందనను నిర్వహించాలని నిర్ణయించారు. తామూ జిల్లాకు చెందిన వారమేనని, తమ సమస్యలను చెప్పుకునేందుకు ఓ ప్లాట్‌ఫాం అవసరమంటూ తమ ఆవేదనలను ఇప్పటికే ఎస్పీకి ఫేస్‌బుక్‌ ద్వారా పలువురు తెలియజేశారు. భూ సమస్యలను సైతం రెవెన్యూ, భూసర్వే విభాగం తదితర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుంటూ వేగవంతంగా పరిష్కరిస్తుండడంతో జర్మనీ, హైదరాబాదు నుంచి ఎస్పీకి వినతులు అందాయి. దీంతో స్పందనను విశ్వవ్యాప్తం చేయాలని నిర్ణయించారు.  

ప్రజల కోసమే పోలీస్‌
పోలీసు శాఖపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు ‘స్పందన’ మంచి అవకాశంగా నాకు అనిపించింది. ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే వారికి సెలవులు లభించక ఇబ్బందులు పడుతుండడాన్ని గమనించా. ఇక విదేశాల్లో ఉండేవారి వెతలు చెప్పక్కర్లేదు. వారి సమస్య ప్రకాశం జిల్లా పరిధిలోనిది అయినపుడు వారికి కూడా న్యాయం జరగాలి కదా అన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌ స్పందనను ప్రారంభిస్తున్నాం.  
– సిద్ధార్థ కౌశల్, ప్రకాశం జిల్లా ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement