
సాక్షి, హైదరాబాద్: తనపై తప్పుడు ట్వీట్ పెట్టినందుకు చంద్రబాబుపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు, వారి విజ్ఞతమీద నమ్మకం లేనప్పుడు, దిగజారిపోయి నిందలేస్తారని, అసత్యాలు, నకిలీ వార్తలు ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు తీవ్ర నిందలేసి.. దారుణమైన అబద్ధాలు చెప్పినా ప్రజలు పట్టించుకోలేదని, వారి విశ్వాసాన్ని ఆయన కోల్పోయారని, వారు బైబై బాబు అంటూ తీర్పు ఇచ్చేశారని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కొద్ది గంటల్లో పోలింగ్ ముగుస్తుందనగా ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మీరు(చంద్రబాబు) దారుణమైన నిందలేశారు.. అబద్ధాలు చెప్పారు.. అయినప్పటికీ ప్రజల విశ్వాసాన్ని మీరు కోల్పోయారు. ప్రజల విజ్ఞతపై మీకు నమ్మకం పోయింది. అందుకే అసత్యాలు, నకిలీ వార్తలు ప్రచారం చేసే స్థాయికి దిగజారిపోయారు. ఇక పోలింగ్ ముగియడానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. ఏపీ ప్రజల తీర్పు ఏమిటనేది స్పష్టంగా తెలిసిపోతోంది. ఇక మీకు బై బై బాబు అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ట్వీట్ చేశారు. తాను, తన బృందంతో రెండేళ్లుగా పడిన శ్రమ వృథా అయిపోతోందని, జగన్ మెజారిటీకి కావాల్సిన అసెంబ్లీ సీట్లను సాధించలేరని ప్రశాంత్ కిషోర్ పెట్టినట్లుగా ఒక తప్పుడు ట్వీట్‌ను సృష్టించడంపై ప్రశాంత్ కిషోర్ ప్రతిస్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.