
సేద్యం సిద్ధం
భారీవర్షం.. అన్నదాతల్లో ఆశలను చిగురింపజేసింది. అదను దాటిపోతోందని భయపడుతున్న రైతన్నకు ఊరటనిస్తూ..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భారీవర్షం.. అన్నదాతల్లో ఆశలను చిగురింపజేసింది. అదను దాటిపోతోందని భయపడుతున్న రైతన్నకు ఊరటనిస్తూ.. రుతుపవనాల ప్రభావంతో బుధవారం జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల ఉదయం నుంచి ఎడతెరపిలేని వాన పడింది. కనిగిరి రిజర్వాయర్ 21 టీఎంసీల సామర్థ్యం అయితే ప్రస్తుతం కురిసిన వర్షానికి 18 టీఎంసీల మట్టానికి చేరింది. జిల్లాకే తలమానికమైన సోమశిల జలాశయం నుంచి ఇప్పటికే నీరు విడుదల చేయడంతో డెల్టా ప్రాంత రైతులు పంటల సాగులో బిజీబిజీగా ఉన్నారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులకు నీరు చేరుతుండటంతో మిగిలిన ప్రాంత రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా 7 లక్షల పైచిలుకు ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సోమశిల జలాశయం కింద మాత్రం 4.16 లక్షల ఎకరాల్లో మాత్రం పంటలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షంతో గతంలో విద్యుత్ మోటార్ల సాయంతో వరి నారుమళ్లు సిద్ధం చేసుకున్న రైతులు నాట్లు వేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు.
వర్షాధారంపై ఆధారపడ్డ రైతుల్లో కొందరు వరి నారుమడులకు విత్తనాలు సిద్ధం చేసుకుంటుంటే.. మరికొందరు ఆరుతడి పంటలు సాగు చేసేందుకు విత్తనాల కోసం వేట ప్రారంభించారు. మెట్ట ప్రాంతాల్లో మినుము, ప్రొద్దుతిరుగుడు, అలసంద, పెసర, మొక్కజొన్న, పత్తి, కూరగాయ తోటలు సాగువుతున్నాయి. బుధవారం కురిసిన వర్షం ఎండిపోతున్న పంటలకు ఊపిరిపోసింది.
భయపెడుతున్నఎరువులు.. విత్తనాలు
జిల్లా వ్యాప్తంగా వర్షాలు కరుస్తుండటంతో రైతులు పంటల సాగుపై దృష్టిసారించారు. అయితే ఎరువులు, విత్తనాల కొరత రైతులను భయపెడుతోంది. జిల్లాలో అత్యధికంగా 2లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తుంటారు. అందులో 34449 (నెల్లూరు మసూర)కు మంచి డిమాండ్ ఉంది. రైతులు కూడా నెల్లూరు మసూర కోసం వెతుకులాడుతున్నారు.
అయితే ఈ విత్తనాలు సమకూర్చటంలో ప్రభుత్వం విఫలమవుతోంది. మిగిలిన బీపీటీ 5204, ఎంపీయు 1010 తదితర రకాల విత్తనాలను మాత్రం ప్రభుత్వం సరఫరా చేసింది. వాటిలో ఇప్పటికే 30 వేల క్వింటాళ్లకుపైనే రైతులు కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎరువుల విషయానికి వస్తే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రబీలో 52,500 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు అవసరం ఉంది. అందులో ప్రస్తుతం కేవలం 11,200 మెట్రిక్ టన్నులు మాత్రం అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా రైతులు యూరియా, డీఏపీ, పొటాష్‌ల కొరత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎరువుల కొరత ఓ పక్క భయపెడుతుంటే.. వ్యాపారులు ఎరువుల ధరలను అమాంతం పెంచి విక్రయిస్తున్నారు. రైతుకు కావాల్సిన ఎరువు అడిగితే దానిపై ఎంఆర్‌పీ ధర కంటే అదనంగా పెంచి విక్రయిస్తున్నారు. 50 కిలో యూరియా బస్తా ధర రూ.283 ఉంటే.. వ్యాపారులు మాత్రం రూ.360 నుంచి రూ.400 వరకు పెంచి విక్రయిస్తున్నారు. రైతులకు ఏ ఎరువులు డిమాండ్ అయితే వాటికే ధరలు పెంచి విక్రయిస్తున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయంపై సంబంధిత అధికారులు దృష్టిసారించాలని పలువురు రైతులు కోరుతున్నారు.