మున్సిపోల్‌కు అంతా సిద్ధం
Published Sun, Aug 4 2013 5:56 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వార్డుల్లో తాజా ఓటర్ల జాబితా తయారీ, వార్డుల రిజర్వేషన్ కేటాయింపు వంటి ముఖ్యమైన ప్రక్రియలు ఇప్పటికే పూర్తి కాగా, పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, రిటర్నింగ్ అధికారుల నియామక పనులను తాజాగా పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈ మేరకు ముసాయిదా జాబితాలను రాజకీయ పార్టీలకు పంపుతూ ఈ నెల 7న వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ జాబితాకు 9న జిల్లా కలెక్టర్ ఆమోద ముద్ర వేస్తారు. తుది ప్రకటన ఈ నెల 12న వెలువడనుంది.
పోలింగ్ స్టేషన్ల గుర్తింపు
విజయనగరం మున్సిపాలిటీలోని 40 వార్డులలో 151 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో పాతవి 95 కాగా, విలీన పంచాయతీల నేపథ్యంలో ఏర్పడిన విభజన కారణంగా కొత్తగా 56 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. సరాసరిన 1,078 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉండేలా చర్యలు చేపట్టారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలను గుర్తించారు. ప్రభుత్వం ఏ క్షణాన ఎన్నిక లు నిర్వహించినా సిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. ఐదేసి పోలింగ్ కేంద్రాలున్న వార్డులు 1,18, 20, 22, 24, 32, 40వ వార్డు, నాలుగేసి కేంద్రాలున్నవి 2, 3, 5,13,15,16, 19, 23, 25 నుంచి 31వరకు, 33, 38వ వార్డులున్నాయి. మూడేసి కేంద్రాలున్నవి 4, 6 నుంచి 12,14,17,21, 35, 36, 37, 39వ వార్డులు ఉన్నాయి.
ఆర్వో, ఏఆర్వోల నియామకం
ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా స్థానిక మండల తహశీల్దార్ రిటర్నింగ్‌గా వ్యవహరిస్తూ మరో ఎనిమిది మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు(ఏఆర్వో)లను ని యమించారు. ప్రతి మూడు వార్డులకు కనీసం ఒక ఏఆర్వో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
ఎన్నికలు జరిగేనా....?
ఓ పక్క అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా... అసలు ఎన్నికలు జరుగుతాయోలేదో అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియకు యూపీఏ అంగీకరిస్తూ ప్రకటన చేసిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఎన్నికలపై ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీమాంధ్రా ప్రజాప్రతినిధులు చేస్తున్న రాజీనామాలే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముం దుకు రాకపోవచ్చు. అయినప్పటికీ ఆశావహులు, మాజీల్లో మాత్రం సందడి కని పిస్తోంది. ఎన్నికలు రేపోమాపో జరుగుతాయన్నట్లు హడావుడి చేస్తున్నారు. వార్డుల్లో ప్రచారం మొదలు పెట్టారు.
Advertisement