- సామాజిక పింఛన్లు ఇష్టానుసారం తొలగిస్తున్నారు
- వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సామాజిక పింఛన్ల సర్వే పేరుతో దారుణాలు జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పింఛనుదారుల పేర్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పింఛను తీసుకుంటున్న వారు మరణిస్తేనే, ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేవారని, ఇప్పుడు అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయన్నారు. ఎన్నో ఏళ్లుగా పింఛన్లు తీసుకుం టున్న వారి పేర్లు అకారణంగా తొలగిస్తున్నారని విమర్శించారు.
ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో అర్హులైన 30 మంది పింఛన్లను తొలగించారని తెలిపారు. వీరందరికీ పింఛన్లు తొలగించినట్లు సంతకం పెట్టకపోతే ఊర్లో ఉన్న లబ్ధిదారులందరికీ పింఛన్లు రావని గ్రామ సర్పంచిని ఎంపీడీవో బెదిరిస్తున్నాని చెప్పారు. ఈ విషయంపై తాను ఎంపీడీవోను ప్రశ్నించగా... ‘మాకు సంబంధం లేదని, కమిటీ వారు మాత్రమే తొలగిస్తున్నారు..’ అని బదులిచ్చారని సారథి వివరించారు.
సర్పంచిని ఎందుకు బెదిరిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. పింఛన్లు తొలగించిన అందరికీ రెండున్నర ఎకరాల పొలం ఉందని సర్వే కమిటీ సభ్యులు నిర్ధారించినట్లు ఎంపీడీవో చెబుతున్నారని, నిజంగా పొలం ఉందా.. ఉంటే పండుతుందా.. అనే వివరాలను కూడా పూర్తి స్థాయిలో సేకరించాలని ఆయన కోరారు. ప్రయివేటు ఉద్యోగుల కుటుంబాల్లో లబ్ధిదారులను తొలగించవద్దని సూచించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమిస్తామని సారథి చెప్పారు.