గ్యాస్ మాయ
ధర తగ్గినా పెరగని సబ్సిడీ
కంపెనీలకే లాభం.. ప్రజలకు శఠగోపం
మండిపడుతున్న ప్రజాసంఘాలు
విజయవాడ : అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ ధరలు తగ్గుతున్నా వినియోగదారులకు ఒక్క రూపాయి కూడా ప్రయోజనం కనిపించడం లేదు. ధరలు తగ్గిన మేరకు వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ జమ కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తగ్గిన ధరలను చమురు కంపెనీల వాటాలో జమచేసి, వినియోగదారుడికి మొండిచేయి చూపుతోందని ప్రజాసంఘాల నేతలు ధ్వజమెత్తుతున్నారు. గత ఏడాదిలో రూ.1,350 నుంచి రూ.778 వరకు గ్యాస్ ధర తగ్గినా సబ్సిడీ మాత్రం పెరగకపోవటంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను తగ్గించింది. గత జనవరిలో డొమెస్టిక్ సిలెండర్ ధర రూ.778 ఉండగా, ఫిబ్రవరిలో రూ.668కి చేరింది. రూ.778 చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకున్న వినియోగదారుకు బ్యాంకుఖాతాలో రూ.336.50 జమ అయ్యేది. వినియోగదారు సిలిండరుకు రూ.441.50 భరించాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో రూ.668కి గ్యాస్ సిలిండర్ ధర తగ్గగా, ఆ మొత్తం చెల్లించిన వినియోగదారుకు బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.226.50 జమ పడుతోంది. వినియోగదారులు సిలిండరును రూ.441.50కే కొనుగోలు చేయాల్సి వస్తోంది. గ్యాస్ సిలిండరు ధర తగ్గినా.. వినియోగదారులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ప్రయోజనం కల్పించలేదని తేటతెల్లమవుతోంది. తగ్గించిన గ్యాస్ ధర చమురు కంపెనీలకే మేలు చేస్తోందని ప్రజాసంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
ఆధార్ అనుసంధానం కాకుంటే 14 నుంచి సబ్సిడీ గల్లంతే...
ఈ నెల 14 నుంచి ఆధార్ నంబర్ గ్యాస్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాకపోతే గ్యాస్ సబ్సిడీ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కటాఫ్ డేట్ ఈ నెల 13తో ముగుస్తోంది. ఆధార్ నంబర్ గ్యాస్, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాని వినియోగదారులు ఈ నెల 14 నుంచి గ్యాస్ సిలిండర్ పూర్తి మొత్తం చెల్లించి కొనుగోలు చేయాలి.. 13 వరకు కూడా ఆధార్ అనుసంధానం చేసుకోనివారికి పార్కింగ్ పిరియడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మూడు నెలలు చివరి అవకాశం ఇచ్చింది. అది 14వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ మూడు నెలల్లో ఆధార్‌ను అనుసంధానం చేసుకుంటే సబ్సిడీ మొత్తం వెనక్కి ఇస్తారు.