
టీడీపీ తొలి జాబితా విడుదల
- సిట్టింగ్‌లు, సీనియర్లకు ప్రాధాన్యం
- నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన
- పలమనేరు నుంచి ఆర్వీ సుభాష్‌చంద్రబోస్‌కు అవకాశం
- చిత్తూరు ఎంపీ స్థానం నుంచి మళ్లీ శివప్రసాద్‌కు టికెట్టు
సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలో ఆ పార్టీ అధినేత పోటీ చేసే కుప్పం సహా శ్రీకాళహస్తి, నగరి, పలమనేరు అసెంబ్లీ సెగ్మెంట్లు, చిత్తూరు లోక్‌సభకు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో వివాదాస్పద సెగ్మెంట్ల జోలికి వెళ్లలేదు. సీనియర్లు, సిట్టింగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్క పలమనేరు నియోజకవర్గానికి మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న ఆర్వీ. సుభాష్‌చంద్రబోస్‌కు అవకాశం దక్కింది.
కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వారికి ఈ జాబితాలో స్థానం కల్పించలేదు. పార్టీ మార్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారన్న అపప్రధ రాకుండా తొలి జాబితాకు రూపకల్పన జరిగినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో కుప్పం నుంచి చంద్రబాబునాయుడు, శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నగరి నుంచి గాలి ముద్దుకృష్ణమ నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలే. చిత్తూరు నుంచి లోక్‌సభ స్థానానికి ప్రకటించిన ఎన్. శివప్రసాద్ కూడా సిట్టింగ్ ఎంపీ కావడం గమనార్హం.
సిట్టింగ్ స్థానాల్లో సత్యవేడు ఒకటి. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమలతకు ఈ జాబితాలో స్థానం దొరకలేదు. చంద్రబాబు జరిపించిన సర్వేల్లో హేమలతపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం ఉంది. తొలిజాబితాలో ఆమెకు అవకాశం కల్పించకపోవడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. కాగా, కుప్పం నుంచి ఆరోసారి చంద్రబాబు బరిలోకి దిగుతున్నారు. ఈయన వరుసగా గెలుపొందుతున్నప్పటికీ ప్రతిసారి ఓట్లు గణనీయంగా తగ్గుతున్నాయి.
శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈయన 2004 ఎన్నికల్లో ఒక్కసారి మాత్రం ఓడిపోయారు. నగరి నుంచి పోటీ చేస్తున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ఏడోసారి శాసనసభకు పోటీ చేస్తుండగా ఒక్కసారి ఓటమి చవిచూశారు. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి కిందటి ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన శివప్రసాద్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
పలమనేరు పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరున్న ఆర్వీ. సుభాష్‌చంద్రబోస్ కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉంది. సుబాష్ సోదరుడు ఆర్వీ.బాలాజీ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అయితే ఆయనను కాదని సోదరుడు సుబాష్‌కు అవకాశం ఇచ్చారు.
అసలు పరీక్ష ముందుంది..
తొలిజాబితా విడదల తరువాత జిల్లా తెలుగుదేశం పార్టీలో పెద్దగా స్పందన లేదు. సిట్టింగ్‌ల పేర్లే ప్రకటించడంతో ఈ జాబితాపై ఎక్కడా చర్చకు అవకాశం లేకుండా పోయింది. తిరుపతి లోక్‌సభ, మదనపల్లె అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించనున్న విషయం తెలిసిందే. మదనపల్లె అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ టికెట్టు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే రాజధానికి చేరుకున్నారు.
చిత్తూరు అసెంబ్లీ టికెట్టు ఆశించిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు రెండు రోజుల కిందట వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో తిరుపతి, చంద్రగిరి, పుంగనూరు, పీలేరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తరువాత అసంతృప్తులు చెలరేగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ముఖ్యంగా తిరుపతి అభ్యర్థి ఎంపిక తరువాత ఆ పార్టీలో పరిణామాలు శరవేగంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ తదితరుల పేర్లు మలివిడత జాబితాలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.