ఓ ప్రాజెక్టుకు.. మరో వంద కోట్లు!
బకాయి కింద స్వాహా చేసేందుకు ఓ ‘స్వగృహ’ కాంట్రాక్టర్ పన్నాగం
జవహర్‌నగర్ వెంచర్‌కు ఎసరు
రూ.380 కోట్ల ప్రాజెక్టు విలువ రూ.100 కోట్లుగా నిర్ధారణ
తన బకాయి కింద దాంతోపాటు మరో రూ.100 కోట్లు చెల్లించాలని ప్రతిపాదన
ఢిల్లీ స్థాయిలో పైరవీ
సాక్షి, హైదరాబాద్: మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఉన్నత వసతులతో ఇళ్లు అందించాల్సిన స్వగృహ ప్రాజెక్టుల్లో లీలలెన్నో. గత నాలుగేళ్లుగా ఈ పథకం నీరుగారిపోవటానికి దారితీసిన పరిణామాలన్నీ విస్మయపరిచేవే. ఇప్పుడు ఓ బడా కాంట్రాక్టర్ వాటిని మించిన డ్రామాకు తెరతీశాడు. తాను చేసిన పనులకు చెల్లించాల్సిన బకాయిల కింద ఏకంగా 2,900 అపార్ట్‌మెంట్లతో ఉన్న జవహర్‌నగర్ స్వగృహ ప్రాజెక్టుతోపాటు.. మరో రూ.100 కోట్లు స్వాహా చేసేందుకు ఎత్తుగడ వేశాడు. ఈ అసంబద్ధ ప్రతిపాదనను అమలు చేసుకోవటానికి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నాడు.
హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో 2,900 యూనిట్లతో స్వగృహ కార్పొరేషన్ బడా ప్రాజెక్టును మొదలుపెట్టి ప్రధాన నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇందుకు దాదాపు రూ.380 కోట్ల వరకు ఖర్చు చేసింది. కానీ స్వగృహ పథకాన్ని పర్యవేక్షించడంలో కిరణ్ ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో అది కాస్తా దారితప్పి అప్పుల కుప్పలో కూరుకుపోయింది. ఫలితంగా సరైన మార్కెటింగ్ కూడా లేకపోవటంతో జవహర్‌నగర్ ప్రాజెక్టు తెల్ల ఏనుగులా మారిపోయింది. దీంతో అది డిమాండ్ లేని ప్రాజెక్టుగా అధికారులు తేల్చి అక్కడ పనులు నిలిపివేశారు. ఎవరైనా ప్రైవేటు నిర్మాణ సంస్థలు ముందుకొస్తే దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమ్మాలని నిర్ణయించారు.
ఇక్కడే ట్విస్ట్ మొదలైంది. చాలాకాలంగా కార్పొరేషన్ స్వగృహ కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవటంతో అవి కొండలా పేరుకుపోయాయి. ఓ బడా కాంట్రాక్టు సంస్థకు ఏకంగా రూ.200 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో తన బకాయికింద జవహర్‌నగర్‌లోని అసంపూర్తి ప్రాజెక్టును దఖలు చేయాలని ఓ ప్రతిపాదన పెట్టింది. అంతేకాకుండా కార్పొరేషన్ రూ.380 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టు విలువను రూ.100 కోట్లుగా ‘నిర్ధారించేసింది’. ఆ నిర్మాణాలు అసంబద్ధంగా ఉన్నందున ఎవరూ కొనరని, అందుకే దాని విలువ అంతకంటే ఎక్కువ ఉండదని ఖరారు చేసింది. ఆ ప్రాజెక్టు తనకు ఇస్తే రూ.100 కోట్ల బకాయి తీరిపోతుందని, మిగతా రూ.100 కోట్లను డబ్బు రూపంలో చెల్లిస్తే సరిపోతుందని అందులో పేర్కొంది. ఇది అసాధ్యమైన ప్రతిపాదన కావడంతో అంగీకరించటం సాధ్యం కాదని అధికారులు తిరస్కరించారు. కానీ, ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న ఆ సంస్థ అక్కడి నుంచి పైరవీ మొదలు పెట్టింది. ప్రభుత్వ పెద్దలతో దానికి పచ్చజెండా ఊపించి తన వ్యూహాన్ని అమలు చేసుకునే పనిలో పడింది. అయితే పదిరోజుల క్రితం కాంట్రాక్టర్ల బకాయిలు తీర్చేందుకు ప్రభుత్వం స్వగృహ కార్పొరేషన్‌కు గృహనిర్మాణ సంస్థకు చెందిన నిధుల్లోంచి బదలాయింపుగా రూ.246 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఇందులో కొంత మొత్తాన్ని ఆ సంస్థకు చెల్లిస్తారో లేదా ప్రాజెక్టునే కట్టబెడతారో చూడాలి.