పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి | Private Schools Demand Exam For All Classes Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ చదువులు

Published Mon, Apr 6 2020 1:20 PM | Last Updated on Mon, Apr 6 2020 1:20 PM

Private Schools Demand Exam For All Classes Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న కరోనావైరస్‌ అన్ని వ్యవస్థల్నీ చిన్నాభిన్నం చేసేస్తోంది. ఆర్థిక, సామాజిక పరంగా ప్రభుత్వాలు, ప్రజలు, సంస్థలు.. కోలుకోనంతగా దెబ్బతిన్నాయి. అదే కోవలో విద్యా వ్యవస్థ కూడా కరోనా దెబ్బకు కునారిల్లుతోంది. సెట్స్‌ వాయిదా పడ్డాయి. పరీక్షలు రద్దయ్యాయి. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలు కూడా మరోసారి వాయిదా వేశారు. అయితే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు ఎంతగానో దోహదపడుతున్నాయి. ప్రభుత్వం వద్దన్నా కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం 9వ తరగతి వరకూ పరీక్షలు నిర్వహిస్తామంటూ తల్లిదండ్రులకు ఫోన్‌ చెయ్యడం గమనార్హం.

ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఒకటి నుంచి పదో తరగతి పరీక్షలు మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యేవి. ఎంసెట్, నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా మే నెలలో నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రైవేట్‌ విద్యా సంస్థలు, అకాడమీలు పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ తరగతులు కూడా ప్రారంభించారు. పదోతరగతి పరీక్షలకు కూడా అంతా సిద్ధమవుతున్నారు. కానీ ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తయిన ఒకట్రెండు రోజులకే కోవిడ్‌–19 దేశంలో విశ్వరూపం చూపించడం మొదలు పెట్టింది. దీంతో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. 9వ తరగతి వరకూ పరీక్షలు నిర్వహించే వీలు లేకపోవడంతో ఆ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థుల్ని పై క్లాసులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్‌ చేస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మార్చి 22 నుంచి ఎవ్వరికీ ఒక్క క్లాసు కూడా జరగకపోవడంతో అంతా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఏప్రిల్‌ 14 వరకూ లాక్‌డౌన్‌ నిర్వహించడంతో అన్ని  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. పరీక్షలూ వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమైపోవడంతో ఆన్‌లైన్‌లో పాఠాలు, హోంవర్క్‌లు పంపిస్తున్నారు వివిధ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు. కోచింగ్‌ సెంటర్లూ ఖాళీ అయిపోయాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాతే అన్ని పరీక్షలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా ఆన్‌లైన్‌ చదువులపైనే దృష్టిసారించారు.

విద్యార్థులు నష్టపోకుండా...
ఈ విద్యా సంవత్సరంలో జ్ఞాన సముపార్జన అవకాశాన్ని నష్టపోకుండా ఇంటర్నెట్‌లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు 10వ తరగతి వరకూ పాఠాలు బోధిస్తుండటంతో విద్యార్థులు వాటిపై దృష్టి సారించారు. ఇవి కాకుండా దీక్షా యాప్‌ ద్వారా మొబైల్‌ ఫోన్‌లో పాఠాలు వినే వెసులుబాటు ఉంది. ఎంసెట్, నీట్, జేఈఈ వంటి ప్రవేశ ప రీక్షలకు శిక్షణ ఇచ్చే విద్యా సంస్థలు తమ వివరాల్ని రిజిస్టర్‌ చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లో సందేహాల్ని నివృత్తి చేస్తున్నారు.

పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి
పరీక్షలు రద్దు చేసి.. పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. ప్రైవేట్‌ విద్యా సంస్థలు మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నాయి. తమ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులకు యాజమాన్యం ఫోన్‌ చేసి.. ఫైనల్‌ పరీక్షలు జరుగుతాయి కాబట్టి చదువుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసిందని చెబుతుంటే.. దాంతో తమకు సంబంధంలేదనీ.. ఎగ్జామ్స్‌ కోసం ప్రిపేర్‌ కావాలని తెగేసి చెబుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితీ..
కరోనా వైరస్‌ కారణంగా పరీక్షలు, వాటి ఫలితాలు వాయిదా పడటంతో విద్యార్థుల్లో ఆందోళన పెరిగింది. ఇంటర్‌మీడియట్‌ విద్యార్థులు పరీక్షలు రాసి.. వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతవరకూ ఇంటర్‌ స్పాట్‌ వాల్యూషన్‌ కూడా మొదలు కాలేదు. పదో తరగతి పరీక్షలు ఎప్పుడు జరుగుతా యన్నది కూడా ఇంకా స్పష్టత లేకపోవడంతో వారు మరో రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక నీట్‌ జేఈఈ అడ్వాన్స్, ఎంసెట్, పీజీ, ఇంజినీరింగ్‌... ఇలా అన్ని రకాల విద్యల్ని అభ్యసిస్తున్న వారి పరిస్థితి ఒక్కో రకంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందో ళన విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్నీ వెంటాడుతోంది.

పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు
కోవిడ్‌–19 ప్రభావంతో 9వ తరగతి వరకూ వార్షిక పరీక్షలు రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఈ ఉత్తర్వులను అన్ని పాఠశాలలూ అనుసరించాల్సిందే. ఏ ప్రైవేట్‌ పాఠశాలైనా పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.– బి.లింగేశ్వరరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement