
‘బండ’డు కష్టాలు!
బుక్ చేసి 20 రోజులైనా సరఫరాకాని సిలిండర్లు
పలు గ్యాస్ ఏజెన్సీల్లో ఇదే పరిస్థితి
సాఫ్ట్‌వేర్ మార్పిడికి బుకింగ్‌ల రద్దు
సాక్షి, హైదరాబాద్: వంటగ్యాస్‌కు ఆధార్ అనుసంధానం లంకె తెగిపోయినా వినియోగదారులకు మాత్రం ఇంకా కష్టాలు తొలగలేదు. రాష్ట్రవ్యాప్తంగా రీఫిల్లింగ్ సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల్లో బుకింగ్‌ల జాబితా కొండవీటి చాంతాడులా పెరిగిపోతోంది. 20 రోజుల క్రితం బుక్ చేసిన వారికి కూడా సిలిండర్లు సరఫరా కాకపోవటంతో వినియోగదారులు గ్యాస్ కోసం డీలర్ల చుట్టూ తిరుగుతున్నారు. సాఫ్ట్‌వేర్ మార్పిడి కోసం గత నెల 26వ తేదీ నుంచి ఈనెల పదో తేదీ వరకూ ఆన్‌లైన్ బుకింగ్‌లన్నీ రద్దు చేయడంతో పెండింగ్ పెరిగిపోయింది. చమురు కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే పది రోజులపాటు సాఫ్ట్‌వేర్ మార్పిడి పేరుతో బుకింగ్‌లను రద్దు చేసి వినియోగదారులకు ఒక సబ్సిడీ సిలిండర్ కోత పడేలా చేశాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాయితీపై ఇచ్చే ఒక సిలిండర్‌కు కోత: ఈ ఆర్థిక సంవత్సరం చివరిలో సిలిండర్ల సరఫరాలో జాప్యం వల్ల చాలామంది రాయితీపై లభించే ఒక సిలిండర్ కోల్పోతున్నారు. రాయితీపై ఒక సిలిండర్ తీసుకున్నాక మరొకటి బుక్ చేసుకునే వ్యవధి లేకపోవటమే కారణం. సిలిండర్ సరఫరా పరిస్థితి తెలుసుకునేందుకు ఫోన్ చేస్తే ‘ఈనెల ఒకటో తేదీ నుంచి 15 వరకూ బుక్ చేసిన వారికి సిలిండర్లు సరఫరా అవుతున్నాయి’ అనే రికార్డెడ్ సమాచారం రావటంపై వినియోగదారులు మండిపడుతున్నారు. గ్యాస్ సిలిండర్లు కోసం వచ్చిన వినియోగదారులతో హైదరాబాద్ శాంతినగర్‌లోని ఓ గ్యాస్ ఏజెన్సీ గత నాలుగైదు రోజులుగా కిటకిటలాడుతోంది. గతనెల 17 నుంచి 25వ తేదీల మధ్య బుక్ చేసిన చాలామందికి గ్యాస్ ఇంకా సరఫరా కాని విషయం వాస్తవమేనని ఆ ఏజెన్సీ తెలిపింది. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెండింగ్ జాబితా పెద్దదే ఉంది.
ఇదీ సమస్య: మార్చి నెల ఒకటో తేదీ నుంచి వంటగ్యాస్‌కు నగదు బదిలీని రద్దు చేసి వినియోగదారులకు నేరుగా సబ్సిడీతో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలో రాయితీ సిలిండర్లు అందించేందుకు గ్యాస్ ఏజన్సీలు సాఫ్ట్‌వేర్ మార్పిడికి ఈనెల 10 వరకూ సమయం తీసుకున్నాయి. గత నెలలో బుక్ చేసుకున్నా ఈనెల ఒకటో తేదీ నుంచి రూ. 441 ధరతో సబ్సిడీ సిలిండర్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే రాయితీ సిలిండర్ల సరఫరా బిల్లుల జారీ సాఫ్ట్‌వేర్ ఈనెల 10 వరకూ అందుబాటులోకి రాలేదు. దీంతో గత నెలలో బుక్ చేసుకున్నా నెలాఖరులోగా సిలిండర్ సరఫరాకాని వారితోపాటు ఈనెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకూ చేసుకున్న బుకింగ్‌లన్నింటినీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(డీలర్లు) రద్దు చేసి మళ్లీ బుక్ చేశాయి. వీటికి అదనంగా పదో తేదీ నుంచి జరిగిన బుకింగ్‌లతో పెండెన్సీ విపరీతంగా పెరిగింది. పదో తేదీ తర్వాత సబ్సిడీ ధరకే సిలిండర్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో చాలామంది ఆధార్‌లేని వినియోగదారులు బుకింగ్‌లను వాయిదా వేసుకున్నారు. కొందరు బుక్ చేసుకున్నా సిలిండర్ ఇంటికి వచ్చాక తీసుకోకుండా వెనక్కు పంపారు. వీరంతా ఈనెల పదో తేదీ తర్వాత మళ్లీ బుక్ చేసుకున్నారు. దీంతో డిమాండ్ పెరిగి గ్యాస్ సరఫరా ఆమేరకు లేక కొరత ఏర్పడింది. ‘రాయితీపై ఏటా 12 సిలిండర్లని ప్రకటించినా ఈ సంవత్సరానికి కంపెనీలు 11కే పరిమితం చేశాయి. ఇప్పుడు ఇలా మరో సిలిండర్‌కు కోత పెట్టాయి’ అని వినియోగదారులు విమర్శిస్తున్నారు. ‘ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాయితీ సిలిండర్ రాదు. ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత 21 రోజుల గ్యాప్ తర్వాత బుక్ చేసుకోవాలనే నిబంధనే కారణం. దీంతో చాలామంది వినియోగదారులు సబ్సిడీ సిలిండర్ కోల్పోవాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.