కూరగాయలకు C/o దేవరాపల్లి..
- వేలాది ఎకరాల్లో సాగు
- రోజూ 40 టన్నులు ఎగుమతి
- ఏటా రూ.కోట్లలో లావాదేవీలు
దేవరాపల్లి: కాయగూరల సాగుకు దేవరాపల్లి పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది. వందలాది కుటుంబాలకు కూరగాయల పంటలే ఆధారం. హోల్ సేల్ వ్యాపారులు ఇక్కడికి నేరుగా వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి నుంచి జిల్లా నలుమూలలతోపాటు ఇతర జిల్లాలకు తరలిస్తుంటారు. సోమవారం మినహా రోజూ ఇక్కడ లావాదేవీలు సాగుతాయి. రైతులు పండించిన దొండ, బెండ, బీరకాయలు, ఆనబ, వంగ, కాకర,అరటి కాయలు, బరబాటి, టమాటా, పచ్చి మిరప, గోంగూర, తోటకూర, పాల కూర వంటివి స్వయంగా అమ్మకానికి తెస్తారు. దేవరాపల్లి మండలంతో సమీపంలోని అనంతగిరి మండలం, విజయగరం జిల్లాకు చెందిన వేపాడ మండలంలోని పలు గ్రామాల రైతులు ఇక్కడి మార్కెట్‌కు కూరగాయలు తీసుకువస్తారు. ఈ మండల రైతులు వరి, చెరకుకు దీటుగా కూరగాయల పంటలు చేపడతారు.
సుమారు 8 వేలు ఎకరాల్లో చేపడుతున్నట్టు అధికారుల వివరాలే చెబుతున్నాయి. రోజూ సుమారు 30 నుంచి 40 టన్నుల వరకు కూరగాయలు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, వ్యాన్‌లు, ఆటోల్లో తరలిస్తున్నారు. రోజూ రూ. లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. ఆది, మంగళవారాల్లో క్రయ విక్రయాలు ఎక్కువగా సాగుతాయి. ఏటా సుమారు రూ.3 కోట్లలో లావాదేవీలు సాగుతున్నట్టు అంచనా. ఇక్కడి మార్కెట్ ప్రదేశం మధ్యాహ్నం వరకు కూరగాయలు ఎగుమతి చేసే వాహనాలతో సందడిగా ఉంటుంది.