
ఎల్లో మీడియాలో దుష్ప్రచారం
వైఎస్ జగన్ విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోను ఉపయోగించుకుని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెరతీసింది.
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా ఉద్యమానికి అసలు సిసలు చిరునామాగా మారిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం విమానాశ్రయంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోను ఉపయోగించుకుని ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెరతీసింది. అందులో జగన్ చేసినట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించి ప్రసారం చేయడంలో ఒక చానెల్ అత్యుత్సాహం ప్రదర్శించింది.
‘నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను అడ్డగిస్తున్నారు. అదే ముఖ్యమంత్రిని ఇలా పట్టుకుంటావా’ అన్న వ్యాఖ్యను వక్రీకరించి నేను ముఖ్యమంత్రిని నన్నే పట్టుకుంటావా అని వ్యాఖ్యానించినట్లుగా సొంతపైత్యం జోడించారు. ప్రతిపక్ష నాయకుడు అనని మాటలను ఆపాదించి ప్రసారం చేసి పండుగ చేసుకుంటున్న సదరు చానెల్‌పై కూడా సోషల్ మీడియాలో హోదా ఉద్యమకారులు దుమ్మెత్తిపోశారు. ఈ ఉత్సాహం హోదా పోరాటానికి మద్దతివ్వడంలో చూపించాలన్న వ్యాఖ్యానాలు కనిపించాయి.
బాధ్యత గలిగిన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఒక శాంతియుత పోరాటానికి వెళ్తుండగా అడ్డగించడమేకాక అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం నిజమే. ప్రతిపక్ష నేత, ఎంపీలకు ప్రొటోకాల్ పాటించకపోతే పోయారు కనీసం ఒక సాధారణ ప్రయాణీకుడికి ఇచ్చిన మర్యాదైనా ఇవ్వరా అని ఆశ్చర్యపోయిన మాటా నిజమే. ఆ విషయాలను వదిలేసి రామాయణంలో పిడకల వేటలా కోడిగుడ్డుపై ఈకలు పీకడం సదరు చానల్ యజమానికి పరిపాటేనని నెటిజన్లు చర్చించుకోవడం కనిపించింది.