ప్రశాంత బీల మళ్లీ రగులుతోంది. ఉద్యమానికి కదం తొక్కుతోంది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న అరుదైన చిత్తడి నేలల్లో పారిశ్రామిక నిర్మాణాలు వద్దని ఏళ్ల తరబడి మొత్తుకుంటున్నా.. మెత్తబడని సర్కారు తీరుపై మండిపడుతోంది. ఇప్పటికే ఎన్‌సీసీ విద్యుత్ ప్లాంట్ అనుమతులు రద్దు చేయాలంటూ ఉద్యమం జరుగుతోంది. 1107 జీవో రద్దు చేస్తామని ఎన్నికల ముందు.. ఆ తర్వాత కూడా మురిపిస్తూ వస్తున్న టీడీపీ సర్కారు.. దాన్ని విస్మరించి అవే చిత్తడి నేలల్లో మరో విద్యుత్ కుంపటి పెట్టడానికి సిద్ధం కావడం బీల పల్లెలను భయాందోళనలకు గురి చేస్తోంది. మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పర్యావరణ, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు సోంపేట, కవిటి మండలాల్లో పర్యటిస్తూ ప్రజలకు పిలుపునిస్తున్నారు.
సంతబొమ్మాళి: ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటుకు చెందిన ఎమ్‌డీ, డెరైక్టర్లు, బ్యాంకు అధికారులు వచ్చారన్న సమాచారంతో వడ్డితాండ్ర థర్మల్ మెయిన్ గేటు ముందు మత్స్యకారులు శనివారం బైఠాయించి శాంతియుతంగా నిరసనను తెలిపారు. థర్మల్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో టెక్కలి సీఐ రమణమూర్తి, నౌపడ, సంతబొమ్మాళి ఎస్‌ఐలు రాజేష్, కృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది మెయిన్ గేటు ముందు మోహరించారు. ఈ సందర్భంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ అనంతు హన్నూరావు మాట్లాడుతూ ప్రజా వినాశనం చేసే థర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా 2007 నుంచి ఇప్పటి వరకు వివిధ రూపాల్లో శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ఆర్డీవో నుంచి రాష్ట్రపతి వరకు వినతి పత్రాలందించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తంపరలో థర్మల్ ప్లాంటు నిర్మాణం వ ల్ల రైతులు, మత్స్యకారులు, ఉప్పు కార్మికులు వీధిన పడుతున్నారన్నారు. సోంపేట పోలీస్ కాల్పుల అనంతరం 2011 మార్చి 2న ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వడ్డితాండ్ర వచ్చి థర్మల్ ప్లాంటును రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు సీఎం హోదాలో ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. సోంపేటలో థర్మల్‌ను రద్దు చేస్తానని చెప్పి బారువలో నాలుగు వేల మెగా ఓట్ల థర్మల్ ప్లాంటును నెలకొల్పుతానని బాబు చెప్పడం దారుణమన్నారు. ఇలా డీఎస్పీ దేవప్రసాద్ ముందు మత్స్యకారులు తమ వినిపించారు. అంతకుముందు ఒడ్డితాండ్ర రిలే దీక్షా శిబిరం నుంచి ప్లాంటు మెయిన్ గేటు వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. పోరాట కమిటీ నాయకులు ఎన్.వెంకటరావు, కారుణ్య ఖత్రో, అనంతు దుర్యోధన, కారుణ్య కేశవ, మత్స్యకార మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రగులుతున్న బీల
Published Sun, Nov 30 2014 2:21 AM | Last Updated on Fri, May 25 2018 5:52 PM
Advertisement